సాక్ష్యాధారిత గుండె సంరక్షణను బలోపేతం చేయడానికి 'ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ' ప్రారంభం
చెన్నై: భారతదేశంలో గుండె కవాటాల (హార్ట్ వాల్వ్) చికిత్సలకు సంబంధించి పక్కా ఆధారాలతో కూడిన వైద్యపరమైన సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా చేపట్టిన 'ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ'ని ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ శనివారం ప్రారంభించారు. గుండె కవాటాలు, నిర్మాణ సమస్యలపై నిర్వహించిన 'ఇండియా వాల్వ్స్ 2026' జాతీయ విద్యా సమావేశంలో ఆయన ఈ నూతన చొరవకు శ్రీకారం చుట్టారు.
విదేశీ రోగుల వైద్య డేటాపై ఆధారపడకుండా, భారతీయుల శరీర తత్వానికి తగ్గట్లు రోగుల సమాచారం, చికిత్సలు, ఫలితాలను క్రమబద్ధంగా నమోదు చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కేంద్రాల సహకారంతో ట్రాన్స్‌క్యాథెటర్ వాల్వ్ చికిత్సలకు సంబంధించిన డేటాను సురక్షితంగా సేకరించి, పరిశోధనలను బలోపేతం చేయడానికి ఈ రిజిస్ట్రీ ఉపయోగపడుతుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్'తో పాటు ఆరోగ్యవంతమైన 'స్వస్థ భారత్'ను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సంరక్షణ అనేది ప్రాథమిక మానవ హక్కని, అధునాతన వైద్య చికిత్సలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
కోవిడ్-19 సమయంలో భారతదేశం వ్యాక్సిన్లను తయారు చేసి 100కు పైగా దేశాలకు సరఫరా చేయడాన్ని గుర్తుచేస్తూ, భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తల సామర్థ్యాలను ప్రపంచం గుర్తించిందని ప్రశంసించారు. ఈ సమావేశంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి కె. జి. అరుణ్‌రాజ్, ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ జి. సెంగోట్టువేలు, డాక్టర్ అశోక్ సేథ్, డాక్టర్ ప్రవీణ్ చంద్ర తదితర ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు.