సాహెల్ ప్రాంతంలో నాటకీయ పరిణామం
నైజర్‌లో తిరుగుబాటును భగ్నం చేసిన రష్యా 'ఆఫ్రికా కార్ప్స్'
నియామీ: పశ్చిమ ఆసియా తరహాలోనే ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం నాటకీయ భౌగోళిక రాజకీయ ఘర్షణకు వేదికైంది. నైజర్ రాజధాని నియామీలో ఆగస్టు 29 తెల్లవారుజామున తిరుగుబాటు సైనికులు జరిపిన ఆకస్మిక తిరుగుబాటును రష్యా రక్షణ దళాలు నిర్ణయాత్మకంగా అణచివేశాయి. అధ్యక్ష భవనం, వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైన్యం జరిపిన ఈ కుట్రను రష్యాకు చెందిన 'ఆఫ్రికా కార్ప్స్' సమర్థవంతంగా భగ్నం చేసింది.
తీవ్రవాదం, అంతర్గత విభేదాల కారణంతో 2023 జూలైలో అధికారాన్ని చేజిక్కించుకున్న జనరల్ అబ్దురహమాన్ టియానీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తిరుగుబాటు దళాలు యత్నించాయి. ఎయిర్ బేస్ 101, డియోరి హమాని విమానాశ్రయాన్ని ముట్టడించి, ప్రభుత్వ టీవీ ప్రసారాలను నిలిపివేశాయి.
తీవ్ర సంక్షోభంలో ఉన్న జనరల్ టియానీ విజ్ఞప్తి మేరకు రష్యా ప్రవేశించింది. రష్యాకు చెందిన 'ఆఫ్రికా కార్ప్స్' కమికాజీ డ్రోన్‌లను మోహరించి తిరుగుబాటుదారుల మెషిన్-గన్ స్థావరాలను ధ్వంసం చేసింది. నైజర్ సరిహద్దు దేశమైన అల్జీరియా సైతం రష్యాలో తయారైన నాలుగు సుఖోయ్ (Su-30) యుద్ధ విమానాలను నేరుగా నియామీకి పంపి గగనతలాన్ని కాపాడింది. గతంలో యెవ్జెనీ ప్రిగోజిన్ నడిపిన 'వాగ్నర్ గ్రూప్'ను పునర్నిర్మించి, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ (GRU) కింద నేరుగా 'ఆఫ్రికా కార్ప్స్'గా రూపాంతరం చేశారు. 2026 నాటికి నైజర్, మాలి, బుర్కినా ఫాసో, లిబియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లలో ఇది రష్యా వ్యూహాత్మక దళంగా మారింది.
ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 230కి పైగా సైనిక తిరుగుబాటు యత్నాలు జరిగాయి. ప్రపంచంలో జరిగే తిరుగుబాట్లలో 44 శాతం ఆఫ్రికాలోనే జరుగుతుండగా, అందులో 58 శాతం ఒక్క సాహెల్, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యాయి. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం పొందిన నైజర్‌లో ఇప్పటివరకు 5 విజయవంతమైన తిరుగుబాట్లు జరిగాయి. పశ్చిమ దేశాల భద్రతా ఒప్పందాలను రద్దు చేసుకుని ఫ్రెంచ్, అమెరికా బలగాలను సాగనంపిన నైజర్ ప్రభుత్వం, ఇప్పుడు రష్యాను తమ అంతిమ భద్రతా హామీదారుగా మార్చుకుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.