‘ఓజీ’, ‘ధురందర్’ ఎస్ఆర్సీసీ వేదికగా జెన్ జెడ్ యాసతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పాల్గొని ప్రసంగించారు. 13 ఏళ్ల క్రితం (2013లో) గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ విద్యాసంస్థలో ఆయన చేసిన ప్రసంగం సంచలనం సృష్టించగా, మళ్లీ ఇన్నాళ్లకు అదే వేదికపైకి వచ్చిన ప్రధాని.. యువత, జెన్ జెడ్ (Gen Z) విద్యార్థులను ఆకట్టుకునేలా "ఓజీ", "ధురందర్" వంటి ఆధునిక పదబంధాలను ప్రయోగిస్తూ అలరించారు. జనరేషన్-జెడ్ (Gen Z) సంభాషణల్లో అసాధారణమైన, ప్రామాణికమైన వ్యక్తులను వర్ణించడానికి ఉపయోగించే “ఓజీ” (OG) పదంతో పాటు దిగ్గజాలను సూచించే “ధురందర్” అనే పదాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
"ఈ సంస్థ పూర్వ విద్యార్థులు ఎంతో ప్రత్యేకమైనవారు. వారు ఈ కళాశాల కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మీ భాషలో (జెన్ జెడ్) చెప్పాలంటే.. ఇక్కడి పూర్వ విద్యార్థులే నిజమైన 'ఓజీలు' (OGs). వారు కేవలం దిగ్గజాలు (ధురందర్లు) మాత్రమే కాదు, సమాజంలో తమదైన ప్రత్యేక ముద్ర వేసిన ప్రతిభావంతులు" అని ప్రధాని కొనియాడారు. 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఇక్కడ తాను చేసిన ప్రసంగం ఒక 'అల'లా మారిందని, 13-14 ఏళ్ల తర్వాత కూడా దాని ప్రభావం నేటికీ చెక్కుచెదరలేదని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.
నాటి ఆశాహీన వాతావరణాన్ని గుర్తు చేస్తూ.. "అప్పుడు నేను నీటి గ్లాసు ఉదాహరణ చెప్పాను. కొందరు సగం ఖాళీ అని, మరికొందరు సగం నిండిందని చూస్తారు. కానీ సగం నీరు, సగం గాలితో ఆ గ్లాసు 'పూర్తిగా నిండి ఉంది' అని సానుకూల కోణంలో చూడాలని నాడు చెప్పాను. అదే విశ్వాసంతో దేశానికి సేవ చేస్తున్నాను" అని తెలిపారు. 2013లో ఉగ్రవాదం, ద్రవ్యోల్బణం, కుంభకోణాలతో భారత్‌ను 'ఫ్రాజైల్ 5' (బలహీన దేశాలు)గా చూసేవారని, నేడు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.