పాక్-చైనా సరిహద్దు కమిషన్‌కు చట్టబద్ధత లేదు
న్యూఢిల్లీ:పాకిస్తాన్, చైనాలు ప్రతిపాదించిన "సరిహద్దు సంయుక్త కమిషన్" నిర్ణయాన్ని భారతదేశం బుధవారం తోసిపుచ్చింది. ఈ చొరవకు ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 1963 నాటి చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గుర్తించలేదని, అది అక్రమమైనదని తెలిపారు. పాకిస్తాన్, చైనాల మధ్య ఎలాంటి ప్రత్యక్ష సరిహద్దు లేదని ఆయన పునరుద్ఘాటించారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని, అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాలపై ఎలాంటి ఒప్పందాలు చేసుకునే హక్కు పాకిస్తాన్‌కు లేదని విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనాలంటే పాత ఒప్పందాలను పాటించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.