వర్ధమాన సాంకేతికతలలో భారత్ అగ్రగామిగా నిలవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:భారత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారం పెరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం సేవా తీర్థలో ప్రముఖ ప్రపంచ, భారతీయ సీఈఓలతో నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వర్ధమాన సాంకేతికతలలో భారత్ తొలి అగ్రగాములలో ఒకటిగా నిలవాలని ఆకాంక్షించారు. దేశంలో ఉన్న విస్తారమైన ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణను వివరిస్తూ.. ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో పరిశ్రమల నాయకులు చురుగ్గా పాల్గొనాలని కోరారు.
ఏఐ (AI) రంగంలో కోటి మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని పేర్కొన్నారు. సెమీకండక్టర్ రంగానికి ఊహించదగిన, అనుకూలమైన విధాన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కాగా, మైక్రాన్, ఇంటెల్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, ఏఎమ్‌డీ, ఐబీఎమ్ వంటి ప్రముఖ గ్లోబల్ సంస్థల సీఈఓలు పాల్గొన్న ఈ సమావేశంలో.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని, ఐఎస్ఎమ్ 2.0 (ISM 2.0) ద్వారా సెమీకండక్టర్ తయారీ, డిజైన్ రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రతినిధులు కొనియాడారు.