హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి
వీణ ధరించి జ్ఞానస్వరూపుడిగా భక్తులకు దర్శనం
తిరుమల, 2026 సెప్టెంబరు 16:: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో, వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
వాహనసేవ సందర్భంగా తిరుమాడ వీధులు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. మంగళవాయిద్యాల నడుమ, వేదఘోషలు, భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు వాహనసేవకు మరింత శోభను చేకూర్చి భక్తులను విశేషంగా అలరించాయి.
జ్ఞానానికి ప్రతీక హంస వాహనం
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానస్వరూపుడిగా ప్రకాశిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు తెలియజేస్తున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనం కాగా, అది జ్ఞానానికి ప్రతీకగా భావించబడుతుంది. పాలు–నీళ్లను వేరుచేసే హంస స్వభావం వివేకానికి, ఆత్మ–అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొనబడింది.
పరమాత్మ తత్వాన్ని గ్రహించి, ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయులను ఉపనిషత్తులు “పరమహంసలు”గా అభివర్ణిస్తాయి. ఈ నేపథ్యంలో భక్తుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వివేకజ్ఞానాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక ఉన్నతికి చేర్చే సంకల్పానికి హంస వాహనసేవ ప్రతీకగా నిలుస్తుంది. శ్రీవారి దివ్య దర్శనంతో భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతి వెలిగి, ఆధ్యాత్మిక చైతన్యం వికసించాలని ఈ సేవ సందేశమిస్తుంది.
గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమలలో, హంస వాహనంపై జ్ఞానస్వరూపుడిగా వెలసిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచింది.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.