దిగ్గజ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ షురూ.. ముఖ్మ అతిథిగా కమల్ హాసన్
భారతీయ సంగీత దిగ్గజం, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రానికి చెన్నైలో అంకురార్పణ జరిగింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశాన్ని ప్రారంభించారు.
భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేసి, కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గాన కోకిల భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వేదికగా ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకకు లెజెండరీ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర తొలి సన్నివేశానికి ఆయన క్లాప్‌నిచ్చి లాంఛనంగా ప్రారంభించారు. ఈ బయోపిక్‌కు టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాలేదని, ఆమె ప్రయాణంలో ఎన్నో అసాధారణ అంశాలు ఉన్నాయని తెలిపారు. ఏడేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పరిశోధన చేసి, కుటుంబ సభ్యుల అనుమతితో ఈ కథను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నేటి తరానికి ఆమె జీవితంలోని క్రమశిక్షణ, త్యాగాలను స్ఫూర్తిగా నిలిపేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు దక్షిణ భారత భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.