స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్ సైడ్ విక్టరీ రావాలి! -టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్ సైడ్ విక్టరీ రావాలి!
-టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
-వైసిపి నాయకులు ఫస్ట్ గ్రేడ్ క్రిమినల్స్... కుల,మతాలను రెచ్చగొడతారు
-కేడర్ అప్రమత్తంగా ఉండి గొడ్డలి పార్టీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి
-డీఎస్సీ అంటే జగన్ కు డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ గుర్తొస్తాయి
-కుటుంబం, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి
నెల్లూరు బ్యూరో, మేజర్ న్యూస్: అక్టోబర్, నవంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్ సైడ్ విక్టరీ రావాలి, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ డిఎ జెండా ఎగరాలని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిస్తే కార్యకర్తలకు న్యాయం, ప్రజలకు మరింత సేవ చేయగలమని అన్నారు. వైసిపి నాయకులు ఫస్ట్ గ్రేడ్ క్రిమినల్స్... రాజకీయ ముసుగులో కుల,మత విభేదాలు రెచ్చగొడతారు. మనం అప్రమత్తంగా ఉండాలి. వారి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. కోడికత్తి డ్రామా చూశాం. సొంత బాబాయిని లేపేసి బాబుగారి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అని రాశారు. ఇటీవల ఈడి అవినాష్ ను పిలిచింది. ఎన్నికల సమయంలో జగన్ గులకరాయి డ్రామా చూస్తే ఆశ్చర్యమేసింది. ప్రతిదీ చంద్రబాబు, లోకేష్ చూసుకోవడం సాధ్యం కాదు. మనకు వారి మాదిరి దొంగ పేపర్లు, టివిలు లేవు. అయితే కోటిమంది కార్యకర్తలు ఉన్నారు. మనమంతా మాట్లాడటం మొదలు పెడితే వారు ఎన్నిరాసినా ప్రజలు నమ్మరు.
చేసిన మంచితోపాటు గొడ్డలి పార్టీ కుట్రలను తెలియజేయండి
భారతదేశంలో ఎవరూ ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సు కల్పిస్తున్నాం. రైతులకు అన్నదాత సుఖీభవ, చేనేతల సేవలో, ఆటోవాలా సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పథకాలు అమలు చేస్తున్నాం. 16వేల టీచర్ పోస్టులు, 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. గూగుల్, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రాష్ట్రానికి రప్పించాం. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల బండిలాంటివి. వాటిని సమర్థమంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. వైసిపి హయాంలో రోడ్లపై పడిన గుంతలు పూడ్చడానికి 2వేల కోట్లు ఖర్చయ్యాయి. ప్రజాప్రభుత్వం గత రెండేళ్లలో చేసిన మంచిపనులతోపాటు గొడ్డలిపార్టీ కుట్రలను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కేడర్ పై ఉంది.
వేమిరెడ్డి దంపతులకు అభినందనలు
నెల్లూరుగడ్డపై ఎంతో గొప్పవాళ్లు జన్మించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నెల్లూరు వాళ్లు ఉంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు బెజవాడ గోపాలరెడ్డి జన్మించిన నేల కోవూరు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినపుడు కోవూరుకు చెందిన బెజవాడ పాపిరెడ్డి తొలి కార్యకర్తగా చేరారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నేల ఇది. కోవూరులో అన్నగారి విగ్రహంలేని లోటు తీర్చిన వేమిరెడ్డి దంపతులకు అభినందనలు. కోవూరు టిడిపి కంచుకోట. కొందరు మనపార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లారు. అయినా ఎత్తిన పసుపుజెండా దించని కార్యకర్తలు అండగా నిలబడ్డారు. ఈ నియోజకవర్గంలో 8 సార్లు మనం గెలిచాం. విపిఆర్ తాగునీటి సమస్య పరిష్కారానికి స్వచ్చందంగా ముందుకు వచ్చి సేవలు చేస్తున్నారు. ప్రజలకోసం ఏదో చేయాలనే తపన ఆయనలో ఉంది. ఎంతోమంది డబ్బు సంపాదించినా అటువంటి ఆలోచన రావడం అభినందనీయం.
డిఎస్సీ అంటే జగన్‌కు డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ గుర్తొస్తాయి!
డిఎస్సీకి, ఎపిపిఎస్సీ కి తేడా తెలియని వ్యక్తి నన్ను ప్రశ్నిస్తున్నారు. దేశ చరిత్రలో అనేక మంది సిఎంలను చూశా, గత అయిదేళ్లలో సైకోని చూశా. గొడ్డలిపార్టీ అధినేతకు డిఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ గుర్తొస్తాయి. వారు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క టీచర్ పోస్టు ఇవ్వలేదు. మనం 16వేల టీచర్ పోస్టులు ఇస్తే ప్రశ్నిస్తున్నారు. డిఎస్సీపై తప్పుడు ఆరోపణలతో సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించాలని హైకోర్టులో వాళ్లు పిటిషన్ వేయగా, కోర్టు మొట్టికాయలు వేయడంతో పిల్ వేస్తే విత్ డ్రా చేసుకున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 53రోజులు జైలులో పెడితే సింహంలా తిరిగి వచ్చారు. ఆయన ఎప్పుడు భయపడలేదు. నేను మళ్లీ చాలెంజ్ చేస్తున్నాను. డిఎస్సీపై చర్చకు నేను, సిద్ధం, జగన్ సిద్ధమా... అరిగిపోయిన రికార్డులా డిఎస్సీలో అవకతవకలు అంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఎటువంటి తప్పు జరగకపోయినా ప్రజలను నమ్మించేలా వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. మనం నిజాన్ని ఎక్కువ సార్లు ప్రజలకు చెప్పాలి. ఇటీవల 10వేల టీచర్, పోలీసు, ఇతర పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. అదీ మన చిత్తశుద్ది.
కులం ముసుగులో వస్తున్నారు...తస్మాత్ జాగ్రత్త!
వైసిపి నాయకులు కులం ముసుగులో జనంలోకి వస్తున్నారు. సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేస్తే మరొకరిని తీసుకొచ్చి కేసు మాఫీ చేసుకోవాలని చూశాడు. జగన్ చనిపోయిన బిసి కుటుంబం పరామర్శకు వెళ్లకుండా అప్పలరాజు ఇంటికి వెళ్లాడు. జగన్ బడా చోర్ అయితే, కారుమూరు నాగేశ్వరరావు చోటా చోర్. మద్యంలో 400 కోట్లు దోచేసి, కోడలు ఎకౌంట్ లో వేసి బుక్ చేశాడు. ఇన్‌కం టాక్స్, ఈడి వాళ్లు వచ్చి బొక్కలో వేశారు. ఆ వ్యవహారంలో మనకు సంబంధం లేదు. అయినా మనపై తోస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమర్ నాథ్ గౌడ్, నందం సుబ్బయ్యలను ఎలా చంపారో చూశాం. గొడ్డలిపార్టీ మారణాకాండపై బిసిల్లో చైతన్యం తేవాలి. అయిదేళ్ల అరాచకాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. సంక్షేమం, అభివృద్ధితోపాటు గొడ్డలిపార్టీ దుష్ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
మరోసారి ఆమె గురించి తప్పుగా మాట్లాడితే సహించం!
ప్రజల కోసం ప్రశాంతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. వారిది గౌరవంగా బతికే కుటుంబం, ఏనాడు తప్పు చేయలేదు. కొంతమంది రౌడీలు, నియోజకవర్గానికి ఒక్కపని చేయని వారు ఆమె గురించి మాట్లాడుతున్నారు. త్వరలో మీ టైం కూడా వస్తుంది, ఎవరినీ వదలిపెట్టం. నీతి,నిజాయితీగా ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చిన విపిఆర్ కుటుంబం గురించి, వారి క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు వైసిపి నాయకులకు ఎవరిచ్చారు. మరోసారి అటువంటి మాటలు మాట్లాడితే వారి సంగతి చూస్తా. అసెంబ్లీలో సైకోలు చేసిన వ్యక్తిత్వ హనన వ్యాఖ్యల వల్ల నాతల్లి మూడునెలలు బాధపడింది. ఏనాడు నేను జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల గురించి మాట్లాడలేదు. ఆయన భార్య భారతి గురించి ఓ కార్యకర్త మాట్లాడితే జైలుకు పంపించాం. పార్టీ ఏదైనా రాజకీయం వేరు, కుటుంబం వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. బుల్లెట్ దిగిందా, గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడో చూశాం. ఈరోజు అతడి పరిస్థితి ఏమిటి, బాబుగారి జోలికి ఎవరు వచ్చినా మాడి మసైపోయారు.
కార్యకర్తే అధినేత నినాదాన్ని చేతల్లో చూపుతున్నాం
కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని చేతల్లో చూపుతున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అధ్యక్షుల వారి పక్కన సాధారణ కార్యకర్తలు కూర్చున్నారు. కడప మహానాడులో మనం చేసుకున్న ఆరు శాసనాల్లో ఒకటి కార్యకర్తే అధినేత. పసుపు సైన్యం త్యాగం, రక్తం వల్లే మనకు అధికారం దక్కింది. పల్నాడులో తోట చంద్రయ్య గొంతుపై కత్తిపెట్టి వారి పార్టీకి జైకొట్టమంటే జై టిడిపి, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. ఆయనే నాకు స్పూర్తి, ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు చట్టాన్ని సవరించాం. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత టిడిపిది. మంజుల, అంజిరెడ్డి తాత ధైర్యాన్ని చూశాం. మనది ఒక పెద్ద కుటుంబం. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి, ఇప్పటివరకు రూ.175 కోట్లు అందించాం. కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే మా లక్ష్యం. ప్రతి కార్యకర్త సొంత కాళ్లపై నిలబడాలన్నది బాబు గారి ధ్యేయం. కార్యకర్తల ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం ముఖ్యం. మన ఆరోగ్యం బాగుంటే కుటుంబం, పార్టీ బాగుంటాయి.పార్టీ కార్యాలయంలో రక్తపరీక్షలు చేయించుకోండి. ఉచితంగా మందులు కూడా అందించే బాధ్యత నాది. మైటిడిపి, మై హెల్త్ యాప్ లు తెచ్చాం. ఆ కార్యక్రమానికి సహకరించండి.
నా తెలుగుదేశం – నా బాధ్యత నినాదానికి కట్టుబడి ఉండండి
కార్యకర్తలంతా నా తెలుగుదేశం, నా బాధ్యత అనే నినాదానికి కట్టుబడి ఉండాలి. జిల్లా నుంచి పార్లమెంటు వ్యవస్థ తేవడానికి మూడు పొలిట్ బ్యూరో సమావేశాలు పట్టింది. పార్టీలో మార్పు రావాలి, యువరక్తం రావాలని పోరాడా. మనది కోటి 6లక్షల సభ్యులున్న అతిపెద్ద కుటుంబం. చిన్నచిన్న సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుందాం. ఏదేని అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్నాక జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనాలి. పాదయాత్ర చేసినపుడు కార్యకర్తలు కలిశారు. పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలన్నారు. అందుకే మై టిడిపి యాప్ తెచ్చాం. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు చేసిన నామినేటెడ్ పోస్టులు వెదుక్కుంటూ వస్తాయి. ప్రతి వ్యక్తి యాక్టివిటీని చంద్రబాబు చూస్తున్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో 45రోజుల్లో కోటి 10లక్షల గడపలు కార్యకర్తలు తొక్కారు. ఒకరోజు 47వేలమంది పాల్గొన్నారు. అదే మనందరికీ శ్రీరామరక్ష. కార్యకర్తలు నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని గుర్తించే బాధ్యత నాది.
కేడర్ అంతా ప్రజలతో మమేకం కావాలి
కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి, వారితో మమేకం కావాలి. వారితో అనుబంధం చాలా ముఖ్యం. ప్రజలతో బంధం ఏర్పడటం వల్లే మంగళగిరి ప్రజలు నన్ను 91వేల మెజారిటీతో గెలిపించారు. కార్యకర్తలంతా ప్రజలతో అనుసంధానం అవ్వండి. ప్రజలకు దగ్గర కావాల్సిన అవసరం ఉంది. క్లస్టర్, యూనిట్ పనిచేయకపోతే దండం పెట్టి మార్చుకుంటాం. డోర్ టు డోర్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 8వేల బూత్ లలో ఇన్చార్జిలు తిరగలేదు. 75ఏళ్ల వయసులో బాబు గారు తిరుగుతుంటే మనం వెళ్లకపోతే ఎలా? పార్టీ కార్యకర్తలంతా సీరియస్ గా తీసుకొని పనిచేయండి. ఏ కార్యక్రమం చేసినా మన టిడిపి యాప్ ద్వారా తెలియజేయండి. కోటి 6లక్షలకు తోడు మనకు జనసేన, బిజెపి కూడా ఉన్నాయి. నోక్రాస్ ఫైర్, మిస్ ఫైర్, విడాకులు ఉండవు. పార్టీ అధినేతలుగా మాకు ఎలాంటి డౌట్లు లేవు. డౌట్ వస్తే నేను పవనన్నకు నేరుగా ఫోన్ చేస్తా. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి.
ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం
ప్రభుత్వ కొనసాగింపు వల్ల గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. అయిదేళ్లు ప్రభుత్వం మారడం వల్ల ఇబ్బంది పడ్డాం. జైలుకు వెళ్లాం. కష్టకాలాన్ని మర్చిపోకూడదు. 2019-24వరకు దొంగ కేసులు పెట్టారు. నాపై 23 కేసులు పెట్టారు. కేసులపై అప్రమత్తంగా ఉండాలి. భైరెడ్డి శబరి నేతృత్వంలో కమిటీ వేశాం, రివ్యూ చేసి దొంగ కేసులు తీసేస్తున్నాం. ఎవరిపైనైనా తప్పుడు కేసులు ఉంటే పార్టీ ఆఫీసుకు తెలియజేయండి. ఉపాధి హామీ, నీరు చెట్టు, ఇతర బిల్లులు క్లియర్ చేశాం. 200 కోట్లు పెండింగ్ ఉంది. అది కూడా క్లియర్ చేస్తాం. 2029 నాటికి పెండింగ్ ఉన్నాయంటే ఒప్పుకోను. కోవూరులో అద్భుతమైన నాయకత్వం ఉంది. వారికి అండగా నిలబడాలి. నియోజకవర్గాన్ని కంచుకోటగా తయారు చేయాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం జెండా ఎగరాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
లోకేష్ చేతులమీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆనందంగా ఉంది
ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల అమరావతిలో నిర్వహించిన కాంక్లేవ్ తన లాంటి రాజకీయ నాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. కోవూరులో తొలిసారిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని యువనేత లోకేష్ చేతులమీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ... యువనేత లోకేష్ కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ఆచరణలో చూపుతున్నారు. కోవూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఇక్కడి ప్రజల కల. 83నుంచి పనిచేసిన కార్యకర్తలు కోవూరులో ఎంతోమంది ఉన్నారు. కోవూరులో పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు అండగా నిలబడింది కార్యకర్తలే. వారసత్వమంటే ఆస్తులు పంచుకోవడం కాదు, ఆశయాన్ని పంచుకోవడమని చాటిచెప్పిన నాయకుడు నారా లోకేష్. వయసులో చిన్నవాడైనప్పటికీ పార్టీ పటిష్టత కోసం చంద్రబాబు గారి అడుగుజాడల్లో పనిచేస్తున్నారు. భవిష్యత్ తరాలకు దిక్సూచి లాంటివాడు. కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు పెద్దఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి లోకేష్ కృషే కారణం. రికార్డు టైమ్‌లో డిఎస్సీ నిర్వహించి 16వేలమందికి టీచర్ ఉద్యోగాలిచ్చిన లోకేష్ పై తప్పుడు ఆరోపణలతో బురద జల్లుతున్నారు. మెగా డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేని పార్టీ వైసిపి అని ప్రశాంతిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకట్రాజు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, కోవూరు నియోజకవర్గ అబ్జర్వర్ ఐనంపూడి రమేష్ పాల్గొన్నారు