అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 విజేతగా డ్రాగన్ 11* * *రన్నరప్‌గా పెనుకొండ జట్టు; విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్*
మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ధర్మవరంలోని ఆర్డీటీ మైదానంలో ఆగస్టు 20 నుంచి నిర్వహిస్తున్న 'అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3' బుధవారంతో ముగిసింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో పెనుకొండ జట్టుపై 65 పరుగుల తేడాతో విజయం సాధించి డ్రాగన్ 11 జట్టు విజేతగా నిలిచింది. డ్రాగన్ 11 జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోరు చేసింది.
పెనుకొండ జట్టు 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులకే పరిమితమైంది.
డ్రాగన్ 11ఆటగాడు ఎం. ప్రశాంత్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా, పెనుకొండ జట్టు ఆటగాడు ఆసిఫ్ అన్వర్ 'ఉత్తమ బౌలర్'గా నిలిచారు.
ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజేత డ్రాగన్ 11 జట్టుకు రూ. 1 లక్ష నగదు బహుమతితో పాటు ట్రోఫీని, రన్నరప్ పెనుకొండ జట్టుకు రూ. 50 వేల నగదు బహుమతి, ట్రోఫీని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు జట్టు తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు జిఎం శేఖర్, కునిగిరి నీలకంఠ, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.