నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కార్యాలయ ముట్టడికి యత్నించిన బాధిత రైతులు.. అదనపు వసూళ్లపై తీవ్ర ఆరోపణలు
“రిజిస్ట్రేషన్‌కు ఓ రేటు.. ఫైల్ కదలాలంటే మరో రేటు” అంటూ ఆగ్రహం
పోలీసుల మోహరింపు.. సమగ్ర విచారణకు రైతుల డిమాండ్
నిజాంపేట్ ; సంగారెడ్డి జిల్లా, నిజాంపేట్:
నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూముల రిజిస్ట్రేషన్, ఇతర రెవెన్యూ పనుల విషయంలో తమ నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారంటూ పలువురు బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
ఒక్క ఎకరం భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. “రిజిస్ట్రేషన్‌కు ఒక రేటు.. ఫైల్ కదలాలంటే మరో రేటు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాంపేట్‌లోని మీ సేవ కేంద్రం నిర్వాహకుడి ద్వారా మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలను కూడా బాధితులు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వ్యవహారశైలిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ నాగజ్యోతిపై కూడా బాధితులు ఆరోపణలు చేశారు.
డబ్బులు చెల్లించకపోతే తమ రిజిస్ట్రేషన్, ఫైళ్లకు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అక్కడ మోహరించారు. రైతులు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.