దుబాయ్ కాలేదు.. ‘దెయ్యాల ఓడరేవు’గా మారిన పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్!
ఇస్లామాబాద్: దుబాయ్, సింగపూర్, షాంఘైల సరసన నిలుస్తుందంటూ చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ప్రపంచానికి చూపించిన గ్వాదర్ ఓడరేవు కల గాల్లో కలసిపోయింది. దశాబ్దాల కాలం గడిచినా, బిలియన్ల కొద్ది డాలర్లు కుమ్మరించినా గ్వాదర్ అభివృద్ధి చెందకపోగా, ప్రస్తుతం ఓడలు లేక ‘దెయ్యాల ఓడరేవు’గా మిగిలిపోయింది.
2015లో దాదాపు 65 బిలియన్ డాలర్ల అంచనాతో ప్రారంభించిన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)కు గ్వాదర్ పోర్ట్ కీలక కేంద్రంగా ప్రచారం పొందింది. 20 లక్షల ఉద్యోగాలు, గాజు మేడలు, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మారుతుందని ఆశలు చూపినప్పటికీ.. ప్రస్తుతం కనీసం తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు లేక నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరాచీ పోర్ట్‌లో 33 బెర్త్‌లు ఉండగా, గ్వాదర్‌లో కేవలం 3 బెర్త్‌లు మాత్రమే ఉన్నాయి. ఒక ఏడాదిలో అత్యధికంగా ఇక్కడకు వచ్చింది కేవలం 22 ఓడలు మాత్రమే.
చైనా తన ‘మలక్కా సమస్య’కు ప్రత్యామ్నాయంగా జిన్‌జియాంగ్ నుండి అరేబియా సముద్రానికి నేరుగా దారి కోసం ఈ ఓడరేవును వాడుకుంటోందే తప్ప పాకిస్తాన్ లేదా స్థానిక బలూచ్ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టింది. ఈ ఓడరేవు ద్వారా వచ్చే ఆదాయంలో చైనా 90 శాతం, పాకిస్తాన్ ప్రభుత్వం 10 శాతం పొందుతుండగా, భూమిని ఇచ్చి సర్వస్వం కోల్పోయిన బలూచిస్తాన్‌కు సున్నా శాతం మిగులుతోంది.
20 లక్షల ఉద్యోగల వాగ్దానాలు నీటిమూటలయ్యాయి. స్థానిక మత్స్యకారులను ఓడరేవు పరిసరాల్లో చేపలు పట్టకుండా నిషేధించిన పాక్ ప్రభుత్వం, చైనా ట్రాలర్లకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించింది. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ మిలిటరీ తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతోంది. హక్కుల సంఘాల నివేదికల ప్రకారం, 2026 ఫిబ్రవరి నెలలోనే బలూచిస్తాన్‌లో 200కు పైగా బలవంతపు అదృశ్యాలు, 87 హత్యలు నమోదయ్యాయి. మహిళలు, విద్యార్థినులను కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వరస దాడుల్లో చైనీస్ ఇంజనీర్లు హతమవ్వడం, భద్రతా కారణాల దృష్ట్యా బీజింగ్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇటీవల గ్వాదర్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా హాజరుకాకుండా, వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామాబాద్ నుండి వీడియో లింక్ ద్వారా ప్రారంభించడం గమనార్హం. దుబాయ్‌లా మారాలనుకున్న పాకిస్తాన్ ఆశలు, చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయి శ్మశాన సదృశంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.