రైతుల భవిష్యత్తుకు ఆర్థిక ధీమా
‘పిఎం కిసాన్ మాన్‌ధన్ యోజన’తో ఏడేళ్ల భరోసా
న్యూఢిల్లీ:దేశంలో ఆహార భద్రతకు వెన్నుముకగా నిలుస్తున్న చిన్న, సన్నకారు రైతుల వృద్ధాప్య భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన' (PM-KMY) విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుంది. 2019 సెప్టెంబర్ 12న ప్రారంభమైన ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన అర్హులైన రైతులకు నెలకు ₹3,000 కనీస పెన్షన్ లభిస్తుంది. 18 నుండి 40 ఏళ్ల వయస్సు ఉండి, రెండు హెక్టార్ల వరకు సాగు భూమి ఉన్న రైతులు ఇందులో చేరవచ్చు. లబ్ధిదారుడు చెల్లించే చందాకు సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే జమ చేస్తుంది.
ఈ పథకం కింద 2026 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 24,96,252 మంది రైతులు పేర్లను నమోదు చేసుకున్నారు. హర్యానాలో అత్యధికంగా 5.75 లక్షల మంది, బీహార్‌లో 3.46 లక్షల మంది నమోదవగా.. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో 2.5 లక్షల చొప్పున రైతులు నమోదయ్యారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ₹540.66 కోట్లు వెచ్చించింది. లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి 50 శాతం (నెలకు ₹1,500) కుటుంబ పెన్షన్ లభిస్తుంది. అర్హులైన రైతులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చు.