వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనల ప్రమాదం
లండన్:వాయు కాలుష్యానికి గురికావడం వల్ల ఆత్మహత్య మరణాలు, ఆత్మహత్యా ఆలోచనలు మరియు ప్రయత్నాల ప్రమాదం పెరుగుతుందని ఒక నూతన అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5, PM10), నైట్రోజన్ డయాక్సైడ్ (NO2) వంటి కాలుష్య కారకాల ప్రభావం దీనిపై ఎక్కువగా ఉందని 'జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్'లో ప్రచురితమైన ఈ పరిశోధన పేర్కొంది.
యూకేలోని క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ శాస్త్రవేత్తలు 29 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు. గాలి, నీటిలోని సీసం, ఆర్సెనిక్ వంటి కాలుష్య కారకాలు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, మెదడు పనితీరుతో పాటు మానసిక స్థితిని దెబ్బతీస్తాయని పరిశోధకులు స్పష్టం చేశారు. అలాగే శబ్ద మరియు కాంతి కాలుష్యం కూడా శరీర గడియారానికి అంతరాయం కలిగించి ఒత్తిడిని పెంచుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నివారణ చర్యల్లో పర్యావరణ పరిరక్షణను కూడా ఒక కీలక అంశంగా పరిగణించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.