అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తున్న కెనడియన్లు
తీవ్రమవుతున్న వాణిజ్య యుద్ధం
ఒట్టావా:అమెరికాతో వాణిజ్య చర్చలు విఫలం కావడం మరియు ఇరుదేశాల మధ్య సుంకాల యుద్ధం తీవ్రతరం కావడంతో కెనడా ప్రజలు అమెరికా ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నారు. నిత్యావసర సరుకుల నుండి స్ట్రీమింగ్ సర్వీసులు, వాహనాలు, ప్రయాణాల వరకు అమెరికన్ బ్రాండ్‌లను పక్కనపెడుతూ కెనడియన్లు నిశ్శబ్ద ఆర్థిక సమ్మెను ప్రకటించారు. గత నెలలో 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించగా, కెనడా కూడా అంతే స్థాయిలో సమాధానమిచ్చింది.
కెనడాతో వ్యవహరించడం కష్టమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించగా, పరస్పర ప్రయోజనకరమైన న్యాయమైన ఒప్పందానికి తమ దేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. అయితే, దిగుమతులలో దాదాపు సగం వాటా కలిగిన అమెరికాను హఠాత్తుగా దూరంచేస్తే ఉత్పత్తుల ధరలు పెరిగి వ్యాపార రంగం దెబ్బతినే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.