భారత అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర ప్రశంసనీయం
బీజేపీ నేత నితిన్ నబిన్
ముంబై:దేశ పురోగతిలో మహారాష్ట్ర పోషిస్తున్న పాత్ర అత్యంత ప్రశంసనీయమని బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ కొనియాడారు. గణేశోత్సవాల సందర్భంగా ముంబైలో పర్యటించిన ఆయన సిద్ధివినాయక ఆలయం, లాల్‌బాగ్ చా రాజాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని, భారతీయ సంస్కృతి-సంప్రదాయాలు, దేశాభివృద్ధి సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు 140 కోట్ల మంది ప్రజలు సమిష్టిగా కృషి చేస్తున్నారని, మహారాష్ట్ర ఎల్లప్పుడూ దేశ పురోగతికి అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. కాగా, నితిన్ నబిన్ పర్యటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఆయన పార్టీలోని నూతన నాయకత్వానికి, కొత్త ఉత్సాహానికి ప్రతీక అని కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం 'వర్ష'లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న నితిన్ నబిన్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, సునేత్రా పవార్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.