పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి అదనపు ప్రయోజనం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2014 తర్వాత తొలిసారిగా ఈ పరిమితిని సవరించారు. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు పీఎఫ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
పీఎఫ్‌తో పాటు పెన్షన్, బీమా ప్రయోజనాలు
వేతన పరిమితి పెంపుతో ఇప్పటివరకు పీఎఫ్ పరిధికి వెలుపల ఉన్న కొంతమంది ఉద్యోగులు ఉద్యోగుల భవిష్యనిధి, ఉద్యోగుల పెన్షన్, ఉద్యోగుల డిపాజిట్ అనుసంధానిత బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం ఉన్న 12 శాతం చొప్పున ఉద్యోగి, యజమాని వాటాల విధానం కొనసాగనుంది.
ఏటా రూ.11,339 కోట్ల వ్యయం
వేతన పరిమితిని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడనుంది. ఈ విస్తరణకు ప్రభుత్వం ఏటా సుమారు రూ.11,339 కోట్లు ఖర్చు చేయనుంది. తాజా నిర్ణయంతో సామాజిక భద్రతా పరిధి మరింత విస్తరించనుంది.
2014లో చివరిసారిగా పెంపు
ఉద్యోగుల భవిష్యనిధి పథకంలో వేతన పరిమితిని చివరిసారిగా 2014లో రూ.15 వేలకు పెంచారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి పరిమితిని రూ.25 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వేతనాలు, అధికారిక ఉద్యోగాల విస్తరణకు అనుగుణంగా సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.