ప్రపంచ వృద్ధికి భారత్ చోదకశక్తి: ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేట్ రంగ చైతన్యం, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక సామర్థ్యాల మద్దతుతో ప్రపంచ వృద్ధి తదుపరి దశకు చోదకశక్తిగా నిలిచే సత్తా భారతదేశానికి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ కొనియాడారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నైలలో ఐదు రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి మరియు వ్యాపార వేత్తలతో క్లార్క్ కీలక సమావేశాలు నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు, అధునాతన తయారీ రంగాలు ఉత్పాదకతను మరింత పెంచుతాయని, భారత వికాస ప్రయాణంలో ఐఎంఎఫ్ ఒక సన్నిహిత భాగస్వామిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.