బీహార్‌లో వరద తీవ్రత...కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తృత పర్యటన
పాట్నా:బీహార్‌లో నెలకొన్న తీవ్ర వరద పరిస్థితిని, పంట నష్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. కేంద్ర అధికారుల బృందంతో కలిసి వస్తున్న ఆయన దిఘ్వారా, మనేర్ తదితర ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం తెరాసియా, సరైపూర్ గ్రామాల్లో రోడ్డు మార్గాన పర్యటించి దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడంతో పాటు స్థానిక రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పాట్నాలోని ముఖ్యమంత్రి సచివాలయంలో బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి, ఉన్నతాధికారులతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వరద విపత్తు నిర్వహణ, సహాయక చర్యలు, రైతులకు అందించాల్సిన పరిహారంపై వీరు చర్చించనున్నారు. అనంతరం ముంగేర్‌లోని నవాబ్‌గఢీ సహాయక శిబిరాన్ని సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. కాగా, రాష్ట్రంలోని 15 జిల్లాల్లో దాదాపు 49.67 లక్షల మంది వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. కేంద్ర బృందం అంచనాల ఆధారంగా రాష్ట్రానికి అవసరమైన సహాయక, పునరావాస నిధులను కేంద్రం ఖరారు చేయనుంది.