‘చెప్పారంటే చేసి చూపిస్తారు’
ప్రధాని మోదీ, భారత్ నాయకత్వాన్ని ప్రశంసించిన లక్సెంబర్గ్ ఉప ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట ఇస్తే దాన్ని చేతల్లో చేసి చూపిస్తారని, ప్రపంచ వేదికపై భారతదేశ సామర్థ్యం, నాయకత్వం అద్భుతమైనవని లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి జేవియర్ బెటెల్ కొనియాడారు. సెప్టెంబర్ 7 నుండి 9 వరకు మూడు రోజుల అధికారిక భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి వచ్చిన ఆయన, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రధాని మోదీలో నాకు అత్యంత నచ్చిన విషయం ఏమిటంటే, ఏదైనా చెబితే దాన్ని వెంటనే చేసి చూపిస్తారు. కోవిడ్-19 సమయంలో ఇచ్చిన హామీలను భారత్ నెరవేర్చిన వేగం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఐరోపాలో చర్చలు మొదలయ్యే సమయానికే భారత్‌లో పనులు పూర్తయిపోతాయి" అని కొనియాడారు. ప్రపంచ సంఘర్షణలు, అనిశ్చితుల వేళ ఆచరణాత్మక దృక్పథంతో దేశాల మధ్య వారధులు నిర్మించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్-లక్సెంబర్గ్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం వేగంగా పెరుగుతున్నాయని, సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తమ ఆర్థిక మంత్రి కూడా ప్రత్యేక చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, జేవియర్ బెటెల్‌కు ఘన స్వాగతం పలికారు. భారత్-ఈయూ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) లక్సెంబర్గ్ అందిస్తున్న బలమైన మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని జైశంకర్ పేర్కొన్నారు.
కాగా, తన పర్యటనలో భాగంగా జేవియర్ బెటెల్ చెన్నైని సందర్శించి, ఐఐటి మద్రాస్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నూతన 'ఎస్ఈఎస్' (SES) క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు.