శ్రీధర్ గాదె కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం
గ్రామీణ నేపథ్యంలో సాగే వినూత్న హారర్ కథాంశంతో ప్రముఖ దర్శకుడు శ్రీధర్ గాదె మరో సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ ప్రొడక్షన్ నెం.3 ప్రాజెక్ట్‌ను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించనున్నారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమాలకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఈ చిత్రంలో 'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు మరియు లిఖిత నాయికలుగా అలరించనున్నారు. అలాగే పూజిత పొన్నాడ, సింధు కాసారం తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ కొట్టగా, వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ వేడుకలో విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.
గ్రామీణ వాతావరణంలో భయానక అంశాలను జోడిస్తూ సాగే ఈ హారర్ జానర్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. దర్శకుడు శ్రీధర్ గాదె ఎంచుకున్న కథాకథనాలు, నటీనటుల లుక్స్ ఈ సినిమాను వైవిధ్యంగా నిలబెట్టనున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.