ఆసియా పసిఫిక్ ఇంటర్నెట్ సదస్సు APNIC 62
ముంబైలో 600 మందికి పైగా దిగ్గజాల భేటీ
ముంబై: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న 62వ APNIC సదస్సుకు (APNIC 62) ముంబై వేదికైంది. సెప్టెంబర్ 4 నుండి 10 వరకు జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో 600 మందికి పైగా అంతర్జాతీయ ఇంటర్నెట్ నిపుణులు, సాంకేతిక నాయకులు, నెట్‌వర్క్ ఆపరేటర్లు మరియు విధాన రూపకర్తలు హాజరయ్యారు.
భారత కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY), మహారాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NIXI), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISPAI) సంయుక్తంగా లాభాపేక్షలేని ఆసియా పసిఫిక్ నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (APNIC) సహకారంతో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి.
సదస్సులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలు, నెట్‌వర్క్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, రూటింగ్ సెక్యూరిటీ మరియు ఇంటర్నెట్ గవర్నెన్స్ వంటి ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా MeitY సంయుక్త కార్యదర్శి సుశీల్ పాల్ మాట్లాడుతూ.. విస్తరిస్తున్న భారత డిజిటల్ రంగానికి సురక్షితమైన, విశ్వసనీయమైన ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు కీలకమని, ఈ సదస్సు గ్లోబల్ టెక్ వర్గాలతో భారత్ కలిసి పనిచేయడానికి గొప్ప వేదిక అని పేర్కొన్నారు. APNIC డైరెక్టర్ జనరల్ జియా రోంగ్ లో మాట్లాడుతూ, IPv6 సాంకేతికతను స్వీకరించడంలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా అభినందించారు.
ముఖ్యమైన పరిణామంగా, సెప్టెంబర్ 8న NIXI మరియు APNIC మధ్య కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదరనుంది. భారతదేశంలో IPv6 విస్తరణ, రూటింగ్ భద్రత, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల బలోపేతానికి ఈ ఒప్పందం దోహదపడనుందని NIXI సీఈఓ దేవేష్ త్యాగి తెలిపారు. ఈ కార్యక్రమంలో MeitY కార్యదర్శి ఎస్. కృష్ణన్, మహారాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, ISPAI అధ్యక్షుడు రాజేష్ ఛారియా పాల్గొన్నారు.