ఆగస్టులో ఆటోమొబైల్ రికార్డు విక్రయాలు
24.23 లక్షల యూనిట్లతో జోరు పెంచిన వాహన రంగం
న్యూఢిల్లీ:భారత ఆటోమొబైల్ రికార్డు స్థాయి విక్రయాలతో దేశీయ వాహన రంగం కొత్త చరిత్ర సృష్టించింది. వర్షపాతం మందగించినప్పటికీ, జీఎస్టీ 2.0 ఊపుతో ఆగస్టు నెలలో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు ఏకంగా 17.51 శాతం పెరిగి 24,23,201 యూనిట్లకు చేరినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) సోమవారం వెల్లడించింది. దేశీ ఆటో రిటైల్ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు నమోదైన ఆగస్టుగా ఇది నిలిచింది.
ఈ సందర్భంగా ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ మాట్లాడుతూ.. దేశీయ ప్యాసింజర్ వాహనాల (PV) మార్కెట్‌లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుందని తెలిపారు. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో సీఎన్‌జీ, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధన వాటా 41.95 శాతానికి చేరింది. తద్వారా 40.85 శాతంగా ఉన్న పెట్రోల్ వాహనాల వాటాను తొలిసారిగా అధిగమించడం విశేషం.
ప్యాసింజర్ వాహనాల (PV) రిటైల్ అమ్మకాలు 16.14 శాతం వృద్ధితో 4,02,398 యూనిట్లుగా నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19.69 శాతం పెరిగి 17,14,610 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 14.45 శాతం పెరుగుదలతో 90,769 యూనిట్లకు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 8.64 శాతం వృద్ధితో 1,22,281 యూనిట్లకు పెరిగాయి.
రుతుపవనాల లోటు వల్ల ట్రాక్టర్ల విక్రయాలు తగ్గినప్పటికీ, పట్టణ ప్రాంతాల (10.93%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (24.99%) ప్యాసింజర్ వాహనాలకు భారీ డిమాండ్ కనిపించిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉన్న పండుగల సీజన్‌లో ఆటో విక్రయాలు మరింత పుంజుకుంటాయని డీలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.