హిందీ దివస్ 2026
ముంబైలో 6వ అఖిల భారత అధికారిక భాషా సదస్సు
'రాజ్‌భాష' అవార్డులను ప్రదానం చేయనున్న అమిత్ షా
ముంబై:సెప్టెంబర్ 14 'హిందీ దివస్' పురస్కరించుకుని ముంబైలో నిర్వహించనున్న 6వ అఖిల భారత అధికారిక భాషా సదస్సును కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ప్రారంభించనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అధికారిక భాషా విభాగం రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పండితులు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు మరియు సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి గాను అధికారిక భాషా అమలులో విశేష కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు 'రాజ్‌భాష గౌరవ్' మరియు 'రాజ్‌భాష కీర్తి' అవార్డులను అమిత్ షా ప్రదానం చేయనున్నారు. అనంతరం అధికారిక భాషగా, అనుసంధాన భాషగా హిందీ అభివృద్ధి మరియు ఇతర భారతీయ భాషలతో దాని సమన్వయంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ ఏడాది సదస్సులో జాతీయ గీతం 'వందేమాతరం' చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై ప్రత్యేక చర్చ నిర్వహించడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో నేపథ్య గాయకుడు హరిహరన్, రచయిత నీలేష్ మిశ్రా, పరిశోధకుడు మిలింద్ ప్రభాకర్ సబ్నిస్ మరియు బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ వారసుడు జాయ్‌దీప్ ఛటోపాధ్యాయ పాల్గొననున్నారు. ఇదే వేదికపై 'రాజభాష భారతి' ప్రత్యేక సంచికతో పాటు పలు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.
సదస్సు ప్రాంగణంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, బ్యాంకులు మరియు మహారాష్ట్ర ప్రభుత్వం 32 ప్రత్యేక స్టాళ్లతో ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్ 15న ప్రముఖ గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ప్రత్యేక సమావేశంలో పాల్గొననుండగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343, 351 నిర్దేశించిన బాధ్యతలకు అనుగుణంగా హిందీని, ఇతర భారతీయ భాషలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.