బ్రిక్స్ సమగ్ర వికాసానికి నాలుగు మూలస్తంభాలు
18వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ:భారతదేశపు బ్రిక్స్ అధ్యక్షత స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత అనే నాలుగు మూలస్తంభాలపై దృష్టి సారించిందని, సభ్య దేశాల సహకారంతో ఈ ఉమ్మడి దార్శనికత "ఉభయతారక సహకారంగా" (Win-Win Cooperation) రూపాంతరం చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రెండవ రోజు బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... నూతనంగా ప్రతిపాదించిన 'బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్' అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, పటిష్టంగా మార్చడంలో దోహపడుతుందని స్పష్టం చేశారు. స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లను అనుసంధానించేందుకు 'బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్'తో పాటు, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించేందుకు 'బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్'ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అలాగే ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను రైతులకు అందుబాటులోకి తెస్తూ 'బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్‌వర్క్' వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందన్నారు.
కీలక ఖనిజాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధాలుగా మార్చుకోవడం వల్ల ప్రపంచ ఉమ్మడి పురోగతికి తీవ్ర ఆటంకం కలుగుతుందని హెచ్చరించిన ప్రధాని, సాంకేతికతను స్వీకరించడంలో సమ్మిళితత్వానికి (Inclusivity) భారత్ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. 'సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం' అనే లక్ష్యంతో సాగిన ఈ సమావేశం ముగిసిన అనంతరం, ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.