తిరుమలలో బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా రేపు సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు. అనంతరం రాత్రి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు.
ఎల్లుండి మధ్యాహ్నం మాడవీధుల్లో శ్రీవారి పరివార దేవతలు, గరుడ పఠం ఊరేగింపు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం జరగడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
ధ్వజారోహణం అనంతరం ఎల్లుండి రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్దశేష వాహన సేవ వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరానున్నారు. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, వసతి, భద్రత తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.