ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
ట్రాఫిక్, లోకల్ రైళ్లకు తీవ్ర అంతరాయం
మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వాణిజ్య రాజధాని ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. శనివారం రాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం నాటికి తీవ్ర రూపం దాల్చడంతో నగరంలోని దాదర్, కుర్లా, నలసోపారా, వసాయి-విరార్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కుర్లా స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌లపై భారీగా నీరు చేరడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. నలసోపారా, తులింజ్ బ్రిడ్జి పరిసర రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం కూడా వర్ష సూచన ఉన్నట్లు స్పష్టం చేసింది.
వినాయక చవితి ఉత్సవాల వేళ వర్షాలు పడుతుండటంతో ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు, రవాణా శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.