డ్రగ్స్ కేసులో టీవీ ప్రజెంటర్ సహా 12 మందికి మరణ శిక్ష
కైరో: ఈజిప్టులో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో 12 మందికి కోర్టు మరణ శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో ప్రముఖ టీవీ ప్రజెంటర్ సారా ఖలీఫా (39) కూడా ఉన్నారు. నిందితులను ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించగా.. ఏడుగురిని కేసు నుంచి విడుదల చేసింది.పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు విదేశాల నుంచి డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అక్రమంగా దిగుమతి చేసుకుని, వాటితో నిషేధిత మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద డ్రగ్స్ నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితుల వద్ద అక్రమ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో మరణ శిక్ష పడిన సారా ఖలీఫా.. నేరాలకు సంబంధించిన వార్తలను ‘మిషన్ ఇంపాజిబుల్’ పేరుతో టీవీలో ప్రజెంట్ చేసేవారని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తయారీ, అక్రమ ఆయుధాల వ్యవహారంలో ఆమెకు కూడా సంబంధం ఉన్నట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వాస్తవానికి ఈ కేసులో శిక్షలను గత నెలలోనే కోర్టు ప్రకటించినట్లు సమాచారం. అయితే ఈజిప్టు న్యాయ ప్రక్రియలో భాగంగా మత పెద్దల అభిప్రాయం, అనుమతి తీసుకున్న అనంతరం తాజాగా తీర్పు వివరాలను అధికారికంగా వెల్లడించారు.
ఈ కేసులో మొత్తం 28 మందిపై విచారణ జరగగా.. 12 మందికి మరణ శిక్ష, తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించడంతో పాటు ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేశారు.