BREAKING
పెట్రోల్–డీజిల్ ధరలు స్థిరం.. క్రూడ్ ఆయిల్‌పై అందరి చూపు! కేసీఆర్‌ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు ప్రతి ఎకరాకూ నీరు.. తెలుగుతల్లికి జలహారతి తెలుగు సినీ సంగీత చక్రవర్తి 90 వ జయంతి మ్యాట్రీమోనీ మోసాలు.. ఇలాంటి వారికి డబ్బులు ఇస్తే నిండా మునిగినట్టే! వినాయక చవితి 2026 ఎప్పుడు? సెప్టెంబర్ 14నా, 15నా? పండితులు ఏం చెబుతున్నారు? తెలంగాణకు వర్ష సూచన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు! పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు అవసరం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత హిజ్రాల పేరుతో వసూళ్లు.. హైదరాబాద్‌లో అక్రమ దందాపై పోలీసుల ఫోకస్! పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అశ్వని కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం మిషన్ మోడ్‌లోకి భారతదేశపు మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం: అమిత్ షా శాంతి, ప్రకృతి సామరస్యాన్ని కాంక్షిస్తూ ప్రధాని మోదీ సంస్కృత శ్లోకం పోస్ట్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం... బిఆర్ఎస్ నిరసన

ప్రతి ఎకరాకూ నీరు.. తెలుగుతల్లికి జలహారతి

Select Suryaa Now
ప్రతి ఎకరాకూ నీరు.. తెలుగుతల్లికి జలహారతి

ప్రతి ఎకరాకూ నీరు.. తెలుగుతల్లికి జలహారతి

- పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తాం
- జల సంరక్షణపై కృషికి ‘వాటర్‌మ్యాన్‌’ గుర్తింపు సంతోషం
- కష్టకాలంలో నిలిచిన కార్యకర్తకు పార్టీలో పూర్తి గౌరవం
- 2029లో మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యం
- వైసీపీ ఫేక్‌ ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలి
- కూటమి ఐక్యతతో క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాలి
- టీడీపీ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు
    సూర్య, స్టేట్ బ్యూరో : 
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీరందించి తెలుగుతల్లికి జలహారతి ఇస్తామని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జల సంరక్షణ, సాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎకనామిక్‌ టైమ్స్‌ తనను ‘వాటర్‌మ్యాన్‌’గా పేర్కొనడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
పాలనలో పొలిటికల్‌ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని చంద్రబాబు తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలిచిన కార్యకర్తలకు పూర్తి గౌరవం ఇస్తున్నామని చెప్పారు. ప్రజల ఓటే తమ పాలనకు గీటురాయిగా ఉండాలని, 2029లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో తన జన్మ ధన్యమైందని చంద్రబాబు అన్నారు. కృష్ణా జలాలను చూసినప్పుడు అక్కడి ప్రజల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని, రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు.
జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విజన్‌ ప్లాన్లు రూపొందించామని, పరిపాలనా వెసులుబాటు కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాప్రతినిధులు సమర్థ నాయకత్వం వహిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ పార్టీ, చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యకర్త బలంగా ఉండటం ఎంత ముఖ్యమో.. కూటమి ఐక్యత కూడా అంతే ముఖ్యమన్నారు. ఫ్లెక్సీలు, ఫొటోల విషయంలో వివాదాలకు తావివ్వకుండా కూటమి నేతలంతా కలసి క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు.
‘వాటర్‌మ్యాన్‌’కు అభినందనలు
ఎకనామిక్‌ టైమ్స్‌లో ప్రచురితమైన ‘సీఈఓ నుంచి వాటర్‌మ్యాన్‌’ కథనాన్ని ప్రస్తావిస్తూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చి తెలుగు యువతను ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దిన చంద్రబాబు.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, జల సంరక్షణపై దృష్టి సారిస్తూ ‘వాటర్‌మ్యాన్‌’గా మారారని అన్నారు.
పోలవరం, వెలిగొండ, పట్టిసీమ, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు జల వనరులు అందించేందుకు సీఎం చేస్తున్న కృషిని ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రశంసించిందని మంత్రి తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని కూడా కథనం ప్రస్తావించిందన్నారు. జలధార కార్యక్రమం ద్వారా భూగర్భజలాలను పెంచేందుకు సీఎం చేస్తున్న ప్రయత్నాలను కూడా గుర్తించిందని తెలిపారు. అనంతరం సాగునీటి రంగంలో సీఎం చేస్తున్న కృషికి పార్టీ నేతలంతా స్టాండింగ్‌ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు.
నాయకత్వానికి టీడీపీ చిరునామా
నాయకత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, వర్తమానాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తును అంచనా వేయాలని సూచించారు. గత పాలకులు రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై ఉంచి వ్యవస్థలను విధ్వంసం చేశారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి కూటమిగా రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజల మద్దతు పొందామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. 28 పాలసీల ద్వారా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పరిశ్రమలు గ్రౌండ్‌ అవుతున్నాయని తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు వచ్చాయని, అమరావతి క్వాంటం టెక్నాలజీతో పాటు నాలెడ్జ్‌ హబ్‌గా మారుతుందని అన్నారు. ‘రాయలసీమ రైజింగ్‌’తో ఆ ప్రాంతంలో పలు భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. డేటా ఇంటిగ్రేషన్‌తో పౌరసేవలను సులభతరం చేశామని, భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు.
ఫేక్‌ ప్రచారానికి వాస్తవాలతో కౌంటర్‌
వైసీపీ చేస్తున్న ఫేక్‌ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రతి అంశాన్నీ వాస్తవాలతో గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా వేదికలైన యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో చురుగ్గా ఉంటూ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రతిపక్షం వక్రీకరణలకు పాల్పడుతోందని విమర్శించారు.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మరింతగా ఎదిగేందుకు పార్టీ పూర్తిగా సహకరిస్తుందని, అందుకు అనుగుణంగా వారు కూడా ప్రజలకు మరింత సేవ చేయాలని చంద్రబాబు సూచించారు. నాయకత్వాన్ని పెంచుకుని పార్టీకి మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు.