పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు అవసరం
అసెంబ్లీలో సీఎం విజయ్ స్పష్టం
చెన్నై: రాష్ట్రంలో పోలీసు శాఖ పనితీరుకు ఒక కొత్త కోణాన్ని, సంస్కరణలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో వెల్లడించారు. శాంతిభద్రతల నిర్వహణపై సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.
కోయంబత్తూరు కళాశాల విద్యార్థి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే 36 మందిని అరెస్టు చేసినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనలను వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. "పోలీసులు కేవలం అధికార కేంద్రాలుగా మిగిలిపోకూడదు, వారు ప్రజలకు నిజమైన రక్షకులుగా మారాలి. గత మూడు నెలల్లో నమోదైన నేరాలన్నీ అకస్మాత్తుగా జరిగినవి కావు, అవన్నీ పాత కక్షలు మరియు ప్రతీకార భావనల వల్ల చోటుచేసుకున్నవే" అని ఆయన స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.