మిషన్ మోడ్‌లోకి భారతదేశపు మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం: అమిత్ షా
2026-29 కాలానికి ప్రత్యేక రోడ్‌మ్యాప్ విడుదల
2047 నాటికి 'డ్రగ్ ఫ్రీ ఇండియా'నే లక్ష్యం
పనాజీ: భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమరశంఖం పూరించింది. 2026-29 కాలానికి గాను దేశంలో మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటాన్ని 'మిషన్ మోడ్'లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గోవాలోని పనాజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగంగా మాదకద్రవ్య రహిత యువతరాన్ని తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని, అందుకే ఈ పోరాటాన్ని ప్రభుత్వం ఒక జాతీయ భద్రతా ప్రాధాన్యతగా చేపట్టిందని స్పష్టం చేశారు.
జూలై 2026 నుండి జూలై 2029 వరకు మూడేళ్ల కాలానికి ఒక ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు హోం మంత్రి వెల్లడించారు. నాలుగు స్తంభాల వ్యూహం (నిఘా-అమలు, సింథటిక్ డ్రగ్స్ నిరోధం, డిమాండ్ తగ్గించడం, సామర్థ్య పెంపు-సమన్వయం) ఆధారంగా 200కు పైగా కార్యాచరణాంశాలను సిద్ధం చేశారు. బీఎస్ఎఫ్, కోస్ట్ గార్డ్, కస్టమ్స్ మరియు దర్యాప్తు సంస్థల సమన్వయంతో సరిహద్దులు, విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డార్క్ వెబ్, క్రిప్టోకరెన్సీల ద్వారా జరిగే నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ప్రత్యేక డార్క్ నెట్-క్రిప్టో సెల్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
గణనీయంగా పెరిగిన స్వాధీనాలు.. పునరావాసానికి చర్యలు
2004-14 మధ్య కాలంలో రూ. 40,000 కోట్ల విలువైన 26 లక్షల కిలోల డ్రగ్స్ పట్టుబడగా, 2014-26 కాలంలో అది ఏకంగా రూ. 1.89 లక్షల కోట్ల విలువైన 1.19 కోట్ల కిలోలకు పెరిగిందని, అలాగే 48.68 లక్షల కిలోల మత్తుపదార్థాలను ధ్వంసం చేశామని షా గణాంకాలను వివరించారు. బాధితుల కోసం 1933 మానస్ హెల్ప్‌లైన్, నేరస్థుల కోసం 'నిదాన్' పోర్టల్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 'నషా ముక్త్ భారత్ అభియాన్' ద్వారా దేశవ్యాప్తంగా వ్యసన విముక్తి కేంద్రాల సంఖ్యను 1,751కి పెంచనున్నట్లు, 2027 మార్చి నాటికి అన్ని రాష్ట్రాల్లో అధునాతన ఆంటి-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌లను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు.