ఫ్రాన్స్‌లో కొలువైన అతిపెద్ద రాతి హిందూ దేవాలయం
ప్యారిస్ బీఏపీఎస్ ఆలయ ప్రతిష్ఠాపనపై ప్రధాని మోదీ ప్రశంసలు!
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సమీపంలో నూతనంగా నిర్మించిన బీఏపీఎస్ (BAPS) స్వామినారాయణ హిందూ మందిర ప్రతిష్ఠాపనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో సందేశం ద్వారా సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఈ ఆలయ ప్రారంభం భారత్-ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలలో ఒక కొత్త శకానికి నాంది పలికిందని, "వసుధైవ కుటుంబకం" స్ఫూర్తిని చాటిచెబుతోందని కొనియాడారు.
ప్యారిస్ సమీపంలోని 'సీన్-ఎట్-మార్న్'లోని బస్సీ-సెయింట్-జార్జెస్‌లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఫ్రాన్స్‌లో సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన మొట్టమొదటి రాతి హిందూ దేవాలయం ఇది. ప్రధాన యూరప్ ఖండంలోనే నిర్మించిన అత్యంత పెద్ద రాతి దేవాలయంగా ఇది రికార్డులకెక్కింది.
భారతదేశం నుండి తెచ్చిన సున్నితమైన రాతి శిల్పాలు, ఫ్రెంచ్ ఇంజనీరింగ్ నైపుణ్యం కలబోతగా దీనిని తీర్చిదిద్దారు. బీఏపీఎస్ ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో 13 రోజుల ఉత్సవాల అనంతరం ప్రతిష్ఠాపన జరిగింది. బీఏపీఎస్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు వెలుస్తున్న కొద్దీ భారతదేశ ప్రాచీన ఆలోచనలు, మానవ విలువలు కూడా విశ్వవ్యాప్తమవుతున్నాయని ప్రధాని అన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఉన్న స్నేహాన్ని ప్రస్తావిస్తూ, రక్షణ, సాంకేతికత, అంతరిక్షం వంటి రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. రోమైన్ రోలాండ్ రచనలు, శ్రీ అరబిందో ఆశ్రమంలో 'మదర్' ప్రభావం మరియు ఫ్రాన్స్‌లో భారత సైనికుల త్యాగాలను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. ఈ ఆలయం ఐరోపా అంతటా భారతీయ సంస్కృతి, సేవ మరియు ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.