తిరుపతిలో రౌడీషీటర్ వీరంగం.. హారన్ కొట్టాడని ట్రావెల్స్ మేనేజర్‌పై దాడి.. ఫోన్ ధ్వంసం చేసి బంగారు చైన్ చోరీ
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పట్టపగలే రౌడీమూకలు బరితెగించి వీరంగం సృష్టిస్తున్నాయి. రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న వారిని హెచ్చరిస్తూ హారన్ కొట్టాడన్న చిన్న కారణానికే ఒక ట్రావెల్స్ మేనేజర్‌పై రౌడీషీటర్ దాడికి తెగబడిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. బాధితుడిపై విచక్షణారహితంగా దాష్టీకానికి పాల్పడి, మొబైల్ ఫోన్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేయడమే కాకుండా, మెడలోని తొమ్మిది గ్రాముల బంగారు చైన్‌ను లాక్కుని చంపేస్తానంటూ ప్రాణహాని బెదిరింపులకు గురిచేశారు. ఈ అరాచక ఘటనపై బాధితుడు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే.. సుండుపల్లి మండలం మంచిరెడ్డిపల్లికి చెందిన పి. చంద్రమోహన్ పుదీపట్ల ప్రాంతంలోని కృష్ణ ట్రావెల్స్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల నాలుగో తేదీన ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రయాణిస్తుండగా, చెర్లోపల్లి వద్ద ఉన్న ఆయన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ సమీపంలో కొందరు యువకులు రోడ్డుపై ఇష్టారాజ్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకరంగా వెళ్తుండటం గమనించారు. ప్రమాదం జరగకుండా ఉండేందుకు చంద్రమోహన్ తన వాహనం హారన్ మోగించడంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ దుండగులు వాహనాన్ని అడ్డగించి ఆయనతో వాగ్వాదానికి దిగారు.
ఆ గుంపులోని ఒక దుండగుడు తన పేరు అజీమ్ అని, తానొక రౌడీషీటర్‌నంటూ గర్వంగా చెప్పుకుంటూ చంద్రమోహన్‌పై దాడికి దిగాడు. తీవ్రంగా కొట్టడమే కాకుండా బాధితుడి చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను లాక్కొని నేలకేసి పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా బాధితుడి మెడలో ఉన్న తొమ్మిది గ్రాముల బంగారు గొలుసును బలవంతంగా తెంచుకుని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితుడు చంద్రమోహన్ వెంటనే తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అజీమ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.