*పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ
పాలకొల్లు మేజర్ న్యూస్
పేద, మధ్యతరగతి కుటుంబాల పట్ల కూటమి ప్రభుత్వం మానవత్వంతో పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 98 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.62 లక్షల విలువైన చెక్కులను కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సమయంలో వైద్య ఖర్చులు వారి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని, అలాంటి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.17.94 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వారం పెద్దఎత్తున అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ప్రజలు ఒక్కసారి దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుందని, అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియ మొత్తాన్ని కార్యాలయం తరఫున పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హత పొందిన లబ్ధిదారులను కార్యాలయానికి పిలిపించి నేరుగా చెక్కులు అందజేస్తున్నామని, దీనివల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధిని నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవత్వంతో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతోందన్నారు.పేదల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏకపక్షంగా అండగా నిలవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.