సత్య నికేతన్‌లో భవనం కూలి ఇద్దరు మృతి
ఢిల్లీ సీఎం, ఉన్నతాధికారులతో మాట్లాడిన హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఆదివారం మధ్యాహ్నం బాలుర హాస్టల్‌గా ఉపయోగిస్తున్న ఒక ఐదు అంతస్తుల భవనం హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం పలు రెస్క్యూ ఏజెన్సీల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఆర్‌కే పురం సత్య నికేతన్ లోని 'హాస్టల్ డేజ్' పేయింగ్ గెస్ట్ (PG) భవనంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సీనియర్ పోలీస్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
సత్య నికేతన్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. స్థానిక యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, గాయపడిన వారికి తగిన వైద్యం అందుతోందని ఎక్స్ (X) వేదికగా ఆయన వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), డీడీఎంఏ (DDMA), ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు, ఎంసీడీ మరియు సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని ఖాళీ చేయించామని, శిథిలాల కింద ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని సీఎం పేర్కొన్నారు.