నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామన్న కేటీఆర్
సూర్య అసెంబ్లీ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చ జరిగేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏదో తూతూమంత్రంగా రెండు మూడు రోజులు సభను నిర్వహించి చేతులు దులుపుకునే ధోరణిని ప్రతిపక్షంగా తాము ఎంతమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎన్నో కీలకమైన ప్రజా సమస్యలు పేరుకుపోయాయని, వాటన్నింటిపై విస్తృతంగా చర్చించి పరిష్కారాలు కనుగొనే విధంగా గౌరవ శాసనసభ స్పీకర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఏడు డీఏలు పెండింగ్‌లో పెట్టడంతో ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమ బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. సర్వీసు ముగించుకుని విశ్రాంతి జీవితం గడుపుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు నెలల తరబడి రావాల్సిన బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారందరి తరఫున సభలో గట్టిగా గొంతు విప్పుతామని తేల్చిచెప్పారు.
ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఎండగడతామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో 22ఏ నిషేధిత భూముల పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు మరియు అవినీతి దందా జరుగుతోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 22ఏ భూముల వ్యవహారంలో జరుగుతున్న భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు. రైతాంగ సమస్యలు, రుణమాఫీ వైఫల్యాలు, గురుకులాల దుస్థితితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై సభలో నిలదీసి ప్రభుత్వాన్ని ప్రజల ముందు బోనులో నిలబెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.