|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 09:08 PM
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి రావడంతో రాజకీయంగా పెను దుమారం రేగుతోంది. ముఖ్యంగా జనగామ జిల్లా మనుగడపై వస్తున్న వార్తలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దులను సవరించాలని ప్రభుత్వం భావిస్తుండటమే ఈ చర్చకు ప్రధాన కారణం. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినప్పటి నుంచి ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే.. జనగామ జిల్లాను రద్దు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, జనగామ జిల్లా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు అపోహలు సృష్టిస్తున్నారని.. జిల్లాను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజనలో అనేక లోపాలు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కేవలం నాలుగు లేదా ఐదు మండలాలతో కొన్ని జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల పరిపాలన పరంగా అధికారుల కొరత, జోనల్ వ్యవస్థలో సమస్యలు, స్థానికులకు దూరభారం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని నొక్కి చెప్పారు.
జిల్లాల సరిహద్దుల సవరణపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం త్వరలో రిటైర్డ్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించనుంది. ఈ కమిటీ ప్రజల అభ్యంతరాలను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తుంది. జనగామ జిల్లాను రద్దు చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అయితే మండలాల సర్దుబాటు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
హన్మకొండ లేదా యాదాద్రి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మండలాల విషయంలో ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలి తప్ప.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు ఉండకూడదని ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన లేదా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించకుండా జిల్లాల పునర్నిర్మాణం జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు లేదా పాత జిల్లాల విలీనంపై ప్రభుత్వం అధికారిక కమిటీ వేసిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.