|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 11:29 AM
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ విలేజ్‌లో 1000 గజాల పార్కును హైడ్రా సోమవారం కాపాడింది. దీని విలువ రూ. 13 కోట్ల వరకూ ఉంటుంది. సర్వే నంబరు 23లో ఉషోదయ ఎన్‌క్లేవ్ పేరిట హుడా అనుమతి పొందిన లే ఔట్ ఉంది. ఇందులో 1000 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్ ఎంసీకి ఈ మేరకు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. ఇలా ప్రజల వినియోగంలో ఉండాల్సిన పార్కు స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ పెద్దాయన కబ్జా చేసి చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించి తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఇక అక్కడి నుంచి ఉషోదయ ఎన్‌క్లేవ్ నివాసితుల పోరాటం సాగుతోంది. పార్కుకోసం కేటాయించినట్టు స్పష్టమైన వివరాలున్నా.. ఆ మేరకు పార్కును కాపాడడంలో స్థానిక యంత్రాంగం విఫలమైంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా.. పార్కు స్థలంగానే నిర్ధారించుకుని సోమవారం ప్రహరీని కూల్చేసి.. చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్రజావసరాలకు పార్కుగా కేటాయించిన స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.