|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 08:53 PM
ట్రిపుల్ ఆర్‌కు అనుసంధానంగా రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం సుమారు 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరగనుంది. అయితే, రైల్వే మార్గం కూడా అదే రూట్ వెంబడి ఉండేలా ప్రతిపాదన రూపొందించడంతో, అదనంగా మరో 50 మీటర్ల వెడల్పులో భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ, ఉత్తర భాగాలుగా విస్తరించనున్న ఈ రైల్వే లైన్ మొత్తం సుమారు 400 కిలోమీటర్ల పొడవు ఉండనుంది.రింగ్ రోడ్‌కు అనుసంధానంగా రైల్వే మార్గం కూడా అభివృద్ధి కాబోతుండటంతో, ఈ మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూకీమతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిసరాల్లో గతంలో చోటుచేసుకున్న అభివృద్ధిలా, ట్రిపుల్ ఆర్ పరిధిలో కూడా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఎదిగే అవకాశముందని డెవలపర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ట్రిపుల్ ఆర్ రూట్‌ను ఖరారు చేశారు.రింగ్ రోడ్ వెంట రైలు మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం. రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఓఆర్ఆర్ పరిసరాల్లో అభివృద్ధి చెందినట్లే, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో మరో గ్రోత్ కారిడార్ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.