|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 07:36 PM
తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈగల్ టీమ్ .. మత్తు దందా చేసేవారి గుట్టు రట్టు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణా, విక్రయం, వాడే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున భారీ డ్రగ్స్ రాకెట్‌ను తాజాగా ఈగల్ టీమ్ అధికారులు పట్టుకున్నారు. ఏకంగా మూసివేసిన స్కూల్ అడ్డాగా చేసుకుని.. మత్తుమందుల తయారీ చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఈగల్ టీమ్ బహిర్గతం చేసింది. గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందా ఆటను కట్టించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో ఉన్న మేధా హై స్కూల్ లోపల నిషేధిత ఆల్ఫా జోలం అనే మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి.. బయటికి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో గౌడ్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు.. అతడితో పాటు నలుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.
మూసివేసిన మేధా హై స్కూల్‌ను తమ అడ్డాగా చేసుకున్న గౌడ్ అనే వ్యక్తి.. దాన్ని పగటి వేళ డ్రగ్స్ తయారీకి ఉపయోగించేవాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. సాయంత్రం వేళల్లో స్కూల్‌లో ట్యూషన్ తరగతులు కూడా నడిపిస్తున్నట్లు ఈగల్ టీమ్ దాడిలో వెల్లడైంది. ఈ డ్రగ్స్ తయారీ దందా చాలాకాలంగా నడుస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఇక ఈ మేధా హైస్కూల్‌లో తయారు చేస్తున్న ఆల్ఫా జోలం అనే మత్తుమందు అత్యంత ప్రమాదకరమైందని అధికారులు వెల్లడించారు.
ఈ ఆల్ఫా జోలంను హైదరాబాద్ నగరంలోని కల్లు కాంపౌండ్లతోపాటు.. మరో 3 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఆల్ఫా జోలంను పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మేధా హైస్కూల్‌లోని 3 ఫ్లోర్లలో ఈ ఆల్ఫా జోలం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి.. 4 రియాక్టర్ల సహాయంతో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో సంచలనం.. విజిలెన్స్ కమిషన్‌కు ఏసీబీ రిపోర్ట్, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక
ఆ హైస్కూల్‌పై దాడి చేసిన ఈగల్ టీం.. మొదటగా గౌడ్‌ను అదుపులోకి తీసుకుని.. అతడి వద్ద నుంచి 5 కిలోల ఆల్ఫా జోలంను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ స్కూల్‌లో జరిపిన సోదాల్లో మరో 5 కిలోల డ్రగ్స్, 4 రియాక్టర్లు, వివిధ రసాయనాలు, డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే గౌడ్ సహా డ్రగ్స్ తయారీ చేస్తున్న నలుగురు కార్మికులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్మికులను స్కూల్ లోపలే ఉంచి వారితో గౌడ్ పని చేయించుకుంటున్నాడని విచారణలో తేలింది. ఈ ఘటనతో బోయిన్‌పల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పైకి స్కూల్ లాగా కనిపిస్తూనే.. దాని ముసుగులో భారీ ఎత్తున డ్రగ్స్ తయారీ చేయడం పోలీసులను, స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కేసులో గౌడ్‌తో పాటు మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.