BREAKING
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం చెత్త ఏరుకునే కార్మికులకు 'నమస్తే', 'ఆయుష్మాన్' కార్డుల పంపిణీ హిమాలయాల్లో మితిమీరిన అభివృద్ధే నేపాల్ విపత్తుకు కారణం చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రియురాలికి ఐఫోన్‌ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్ రేవంత్ రెడ్డికి ధైర్యముంటే మా అమ్మపై పోటీ చేసి గెలవాలి యుఎస్ ఉద్యోగాల డేటాకు ముందు కోలుకున్న ఆసియా మార్కెట్లు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, హెచ్చరికలు జారీ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు, ఉరుములు జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం ఐటీ షేర్ల జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ హ్యాపీ జర్నీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి కొత్త తరహా సినిమా నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం పర్యటన పండుగ కాంతులతో వెలిగిపోతున్న మధుర, బృందావన్

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం

Select Suryaa Now
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం
విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఫోన్‌ చేస్తే ఆటోలో యూరియా వచ్చేది 
కాంగ్రెస్‌ పాలనలో మాత్రం యూరియా కోసం రైతులు కష్ట పడుతున్నారని వ్యాఖ్య


తెలంగాణ బ్యూరో ప్రతినిధి : పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో అత్యంత ప్రాధాన్యంతో ప్రస్తావిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) హామీ ఇచ్చారు. మిర్యాలగూడ సభకి వెళ్తున్న కేటీఆర్ ను ఎంజి యూనివర్సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు కలిసి తమ సమస్యలను విజ్ఞప్తి చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల భూములు, విద్యా సంస్థల భవిష్యత్తు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యను టాప్ ప్రయారిటీగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చే వరకు, సమస్యపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్న ప్రాంతాల్లోని విలువైన భూములపై ప్రభుత్వ దృష్టి ఉందనే ఆందోళనను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్మనీ తరహాలో చదువుతోపాటు పని అనుభవం పొందే డ్యూయల్ ప్రోగ్రామ్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టీస్ స్కూల్స్ వంటి విధానాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన సాంకేతిక నైపుణ్యాలు అందించే విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మాట్లాడుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

కేసీఆర్ హయం లో ఫోన్‌ చేస్తే ఆటోలో యూరియా వచ్చేది

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ చేస్తే ఆటోలో యూరియా వచ్చేదని, కాంగ్రెస్‌ పాలనలో మాత్రం యూరియా కోసం రైతులు తమ చెప్పులను లైన్లలో పెట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. నల్లగొండ జిల్లాకు దరిద్రాన్ని తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నామని.. రక్తం రుచి మరిగిన కాంగ్రెస్‌ రాక్షస పులిని తెచ్చుకున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో కేటీఆర్ గురువారం  పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జునసాగర్‌లో నీళ్లు ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు శనిలా దాపురించారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతుల కళ్లల్లో నీళ్లు తెప్పించిన ‘నీళ్ల మంత్రి’ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాద ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలనూ కేటీఆర్‌ ప్రస్తావించారు. సొరంగంలో ‘వాటర్‌లో నీళ్లు కలిశాయి’ అంటూ మంత్రి మాట్లాడారని.. అసలు ఆయన ‘క్వార్టర్‌లో నీళ్లు కలిశాయో ఏమో’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హుజూర్‌నగర్‌లో నీళ్ల కోసం రైతులు తమ బాధలు చెప్పుకుందామంటే వారిని గెదుముతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం కూడా అందుకు భిన్నంగా లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే సీఎం రేవంత్‌ రెడ్డి భయపడుతున్నారని, అందుకే తెలంగాణ నీళ్లు కిందికి పోతున్నా మాట్లాడటం లేదని ఆరోపించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సెప్టెంబర్‌ 14న వినాయక చవితి లోపు రైతులకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటిలోగా నీళ్లు ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. ఈనెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.