ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ:జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నరేలాలోని ప్రసిద్ధ ఖాటు శ్యామ్ ఢిల్లీ ధామ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ (హెచ్చరికలు) జారీ చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అధిక జనసంచారం ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
ఈ ఆంక్షలు శుక్రవారం (సెప్టెంబర్ 4) ఉదయం 7 గంటల నుండి శనివారం (సెప్టెంబర్ 5) తెల్లవారుజామున 1 గంట వరకు అమలులో ఉంటాయి. ముఖ్యంగా సింఘు బోర్డర్ మరియు ముకర్బా చౌక్ మధ్య ఉన్న NH-44 మార్గంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు రద్దీని నివారించేందుకు 'UER-II' మరియు 'పల్లా-బఖ్తవార్‌పూర్ రోడ్'లను ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ పరిస్థితులను బట్టి సింఘు బోర్డర్, UER-II బకోలి, ముకర్బా చౌక్ వంటి కీలక ప్రదేశాలలో వాహనాలను మళ్లించనున్నారు. రహదారులపై అక్రమంగా వాహనాలను పార్క్ చేయకూడదని, అత్యవసర వాహనాల (అంబులెన్స్ మొదలైనవి) రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక బైపాస్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా సమాచారం కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా, వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలను పరిశీలించాలని సూచించారు.