హిమాలయాల్లో మితిమీరిన అభివృద్ధే నేపాల్ విపత్తుకు కారణం
ప్రముఖ పర్యావరణవేత్త సునీతా నారాయణ్
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఇటీవల సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదలకు హిమాలయ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగుతున్న మితిమీరిన అభివృద్ధి కార్యకలాపాలు, నదులు-పర్వతాల సహజ రూపాన్ని మార్చాలనే ఇంజనీరింగ్ ఆలోచనా విధానమే ప్రధాన కారణమని ప్రముఖ పర్యావరణవేత్త, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 'మోబియస్ ఫౌండేషన్' నిర్వహించిన 8వ అంతర్జాతీయ సుస్థిరత విద్యా సదస్సులో ఆమె ముఖ్య ప్రసంగం చేశారు.
హిమాలయాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడం, పర్యావరణాన్ని విస్మరించడమే నేడు చూస్తున్న ప్రకృతి ప్రతీకారానికి కారణమని నారాయణ్ అన్నారు. "మనం ఇప్పటివరకు అనుసరిస్తున్న అభివృద్ధి పద్ధతులు భవిష్యత్తులో ఏమాత్రం పనిచేయవని ప్రకృతి స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది" అని హెచ్చరించారు. భారత వాతావరణ శాఖ గణాంకాల ఆధారంగా CSE చేసిన విశ్లేషణ ప్రకారం, భారతదేశంలో దాదాపు రోజూ ఏదో ఒక మూల తీవ్రమైన ప్రతికూల వాతావరణ సంఘటన (Extreme Weather Event) సంభవిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యావరణ సంక్షోభం ప్రస్తుతం ఒక 'అస్తిత్వ సంక్షోభం'గా మారిందని, కేవలం కొత్త నివేదికలు, సాధారణ చర్యలతో ఈ సమస్యలు తీరవని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. కేవలం కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే కాలుష్యం తగ్గదని, ప్రజా రవాణా వ్యవస్థను అద్భుతంగా విస్తరించి, నడక, సైక్లింగ్, మెట్రో వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను నిత్య జీవితంలో భాగం చేసినప్పుడే నిజమైన పరిష్కారం లభిస్తుందని నారాయణ్ అభిప్రాయపడ్డారు.