BREAKING
బెంగళూరు పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ బ్యూటీ.. వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ అంటూ టాక్! కేరళ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి మంత్రి పదవి కోసం కేకే జోరుగా లాబీయింగ్ నయా దోపిడీకి తెరదీసిన ముఠాలు! కీలక ఖనిజాల వైపు సింగరేణి పరుగులు స్పెయిన్‌లో ‘లా టొమాటినా’ వేడుకలు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రద్దీ కాస్త తగ్గనుంది! హిడ్మా గన్‌మెన్ ముచ్చిక మంగి లొంగుబాటు బీహార్‌లో వరద ముప్పుపై సీఎం సామ్రాట్ చౌదరితో అమిత్ షా సంభాషణ మాస్కోలో CIA చీఫ్ పర్యటన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు తిరుమల భక్తులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇక తిరుపతికి మరింత స్పీడ్‌గా! కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వర్షాభావంతో రైతుల కష్టాలు.. చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు ట్రాఫిక్ చలాన్లు కట్టలేదా? ఇక ఫాస్టాగ్ నుంచే డబ్బులు కట్.. హైదరాబాద్ పోలీసుల సరికొత్త ప్లాన్!

కీలక ఖనిజాల వైపు సింగరేణి పరుగులు

Select Suryaa Now
కీలక ఖనిజాల వైపు సింగరేణి పరుగులు

కీలక ఖనిజాల వైపు సింగరేణి పరుగులు

నైనీ స్ఫూర్తితో.. దేవదుర్గపై ఫోకస్

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

సింగరేణి నూతన ప్రాజెక్టులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సంస్థ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : కర్ణాటకలోని దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ బ్లాక్‌లో అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో సింగరేణి నూతన ప్రాజెక్టులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సంస్థ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ణాటకలో సింగరేణి దక్కించుకున్న దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్‌పై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్‌పై  క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసేందుకు గురువారం సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి దేవదుర్గ బ్లాక్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు.

ఖనిజ అన్వేషణకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాన్ని తీసుకుంటామని ఆయన చెప్పారు. దేవదుర్గ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా బొగ్గు నుంచి కీలక, వ్యూహాత్మక ఖనిజాల రంగంలోకి సింగరేణి విస్తరణకు బలమైన పునాది పడుతుందని ఆయన చెప్పారు. మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి ఇకపై బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా కీలక, వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. 

తెలంగాణకు గుండెకాయలాంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని మరింత లాభదాయకంగా తీర్చిదిద్ది, భవిష్యత్ తరాలకు బలమైన సంస్థగా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

దేవదుర్గపై ప్రత్యేక దృష్టి: 

దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ బ్లాక్‌లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, భౌగోళిక పరిస్థితులు, ఖనిజ నిక్షేపాల అన్వేషణకు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ఉప ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గురువారం సింగరేణి ఉన్నతాధికారుల బృందంతో కలిసి దేవదుర్గ బ్లాక్‌ను సందర్శించనున్నారు. ఖనిజ అన్వేషణ వేగవంతానికి అవసరమైన సహకారంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు. కీలక ఖనిజాల రంగంలో సింగరేణి విస్తరణకు దేవదుర్గ బ్లాక్‌ను ఒక కీలక అవకాశంగా మలచాలని అధికారులకు సూచించారు.

అన్ని ఖనిజ వేలాల్లో పాల్గొనాలి: 

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ సింగరేణి తన కార్యకలాపాలను విస్తరించాలని భట్టి విక్రమార్క సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే బొగ్గు, కీలక ఖనిజాల వేలం ప్రక్రియలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, సింగరేణికి అనుకూలమైన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. సింగరేణి ఇకపై కేవలం బొగ్గు మైనింగ్‌కే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల మైనింగ్‌లోనూ తనదైన ముద్ర వేయాలని పేర్కొన్నారు. త్వరలో వనాడియం, టైటానియం వంటి కీలక ఖనిజ బ్లాక్‌లు వేలానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని విధాల సహకారాన్ని ప్రజా ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన, పారిశ్రామిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల మైనింగ్ వైపు సింగరేణి అడుగులు వేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో ఈ ఖనిజాలకు పెరగనున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త అవకాశాలను గుర్తించాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఖనిజ అవకాశాలను అధ్యయనం చేసేందుకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ తదితర దేశాల్లోని అవకాశాల పరిశీలనకు అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలను పరిశీలించి సింగరేణికి ప్రయోజనకరమైన ప్రాజెక్టులపై ముందడుగు వేయాలని సూచించారు.

డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తి: 

ఒకవైపు కీలక ఖనిజాల రంగంలో విస్తరిస్తూనే మరోవైపు సంస్థ ప్రధాన కార్యకలాపమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి  సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్, ఇంధన భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని, ఈ విషయంలో సింగరేణి కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. 

బొగ్గు ఉత్పత్తిలో అనుభవాన్ని ఉపయోగించుకుంటూనే, కీలక ఖనిజాల రంగంలోనూ సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.