హిడ్మా గన్‌మెన్ ముచ్చిక మంగి లొంగుబాటు
పోలవరం: మావోయిస్టు పార్టీకి ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. టాప్ లీడర్, గెరిల్లా పోరాట నిపుణుడు మడావి హిడ్మాకు అత్యంత నమ్మకమైన పర్సనల్ గన్‌మెన్‌గా వ్యవహరించిన ముచ్చిక మంగి ఆయుధాలు వీడి పోలీసులకు లొంగిపోయారు. ఆమెతో పాటు దళ సభ్యులు లక్ష్మయ్య, ఎంకా కూడా బుధవారం అధికారికంగా సరెండర్ అయ్యారు.
పీఎల్‌జీఏ (PLGA) కేడర్‌లో అత్యంత కీలక పాత్ర పోషించిన ముచ్చిక మంగి, భద్రతా బలగాలతో జరిగిన ఏడు భారీ ఎన్‌కౌంటర్లలో నేరుగా పాల్గొన్నారు. హిడ్మాకు అత్యంత ప్రధాన రక్షకురాలిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. పోలవరం జిల్లా ఓఎస్డీ (OSD) పంకజ్ కుమార్ మీనా సమక్షంలో వీరు లొంగిపోయారు.
జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చిన ఈ ముగ్గురు సభ్యులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పునరావాసం, పరిహార పథకాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు. హిడ్మాకు అత్యంత నమ్మకస్తులైన ముఖ్య కేడర్ లొంగిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల పట్టు మరింత బలహీనపడిందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.