BREAKING
బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్రమంగా కోలుకుంటున్న 'గబ్బర్ సింగ్' నటుడు రమేష్ గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ నిర్ణయాలు గుర్తులు విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమా షూటింగ్ పై కీలక అప్‌డేట్ ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రైతు బజార్లో సన్నబియ్యం అనంతపురంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మైనార్టీల సంక్షేమ కమిటీ ఆత్మకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ *ఆళ్ల నాని హుందాతనానికి ప్రతీక - మంత్రి నారా లోకేష్ నివాళి* ఇంట్లో వినాయక ప్రతిమను ఎందుకు ప్రతిష్టించాలి పూజా విధానం మరియు సామాజిక ప్రాముఖ్యత మండుటెండలో విద్యార్థులు... చల్లని నీడలో అధికారులు..! ఒమన్‌లో అమెరికా–హౌతీ ప్రతినిధుల రహస్య భేటీ జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ ఫెడ్ రేట్ల పెంపు మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్లు జమర్‌పాని బొగ్గు బ్లాక్ అభివృద్ధిని వేగవంతం చేయండి

ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ప్రజా పాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో

ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర ప్రగతి

72 వేల ఉద్యోగాల భర్తీ.. రైతు సంక్షేమానికి రూ.1.70 లక్షల కోట్లు

తెలంగాణ రైజింగ్–2047తో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(సెప్టెంబర్ 17):
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్డీవో వాసుచంద్ర, డీఆర్వో స్వర్ణలత, జడ్పీ సీఈవో సుధీర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్య, వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, తహసీల్దార్ లక్ష్మీనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సుపరిపాలన దిశగా తెలంగాణ

తీవ్ర ఆర్థిక సమస్యల నుంచి రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ తెలిపారు. ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సకాలంలో వేతనాలు అందిస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సుమారు 27.50 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

వికారాబాద్ జిల్లాలో 43,860 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, 93,151 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు రాగిజావ, గుడ్డు, పాలు అందిస్తున్నట్లు వివరించారు.

72 వేల ఉద్యోగాల భర్తీ

తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పీకర్ పేర్కొన్నారు. వెయ్యి రోజుల పాలనలో రైతుల సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

మహిళల సంక్షేమానికి పెద్దపీట

స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించినట్లు తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం గత 32 నెలల్లో ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 6.60 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, వారికి సుమారు రూ.240 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని వివరించారు.

పేద మహిళలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందించే పథకం ద్వారా జిల్లాలో 1.35 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు 4,01,000 సిలిండర్లు పంపిణీ చేసి రూ.10.43 కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 1.45 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

రేషన్ కార్డులు.. పెన్షన్లు

జిల్లాలో కొత్తగా 43,589 రేషన్ కార్డులు జారీ చేసి 1.62 లక్షల మందికి అదనంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఆహార భద్రత కార్డుదారులకు స్మార్ట్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. చేయూత పింఛన్ల కింద జిల్లాలో 1,06,272 మంది లబ్ధి పొందుతున్నారని, కొత్తగా 16,328 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అర్హులైన వారికి త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు.

మహిళా సాధికారతకు చర్యలు

మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2.06 లక్షల మంది మహిళలకు ఏకరూప చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 19 మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో 19 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. కోటిపల్లి మండలం బార్వాద్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో నిర్మించిన సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

జిల్లాలో ఇప్పటివరకు 2,488 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని స్పీకర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరును సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రికి పెట్టినట్లు గుర్తు చేశారు. 40 ఏళ్లుగా పరిష్కారం కాని ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, 1931 తర్వాత నిర్వహించని కులగణనను చేపట్టి సామాజిక లెక్కలు తేల్చామని చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టం తీసుకువచ్చామని, క్రీడలు, ఐటీ, వైద్యం, పర్యాటకం, దేవాదాయ రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందించినట్లు తెలిపారు.

తెలంగాణ రైజింగ్–2047

తెలంగాణను భవిష్యత్‌లో దేశంలోనే కీలక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్–2047 కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పీకర్ తెలిపారు. హైదరాబాద్‌ను మూడు ఆర్థిక మండలాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.