కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి
సూర్య క్రైమ్ డెస్క్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన అవినీతి ఉదంతం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించే పేరుతో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రేషన్ బియ్యం కేసులో అరెస్టయిన నిందితుల నుంచి బెయిల్ కోసం సీఐ అంజనేయులు మరియు ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏకంగా పది లక్షల రూపాయలు డిమాండ్ చేయగా, అందులో మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలను లంచంగా స్వీవరిస్తూ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితులు మరియు ఏసీబీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, కీసర సీఐ అంజనేయులు గత కొంతకాలంగా రేషన్ బియ్యం కేసులోని నిందితులను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలంటూ నిందితులను మానసికంగా ఇబ్బంది పెడుతూ నిత్యం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వేధింపులు భరించలేకపోయిన బాధితుడు నేరుగా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులను ఆశ్రయించి పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల వ్యూహాత్మక ఆదేశాల మేరకు నిందితులు డబ్బు ఇచ్చేందుకు సిద్ధపడగా, కీసర చెరువు వద్ద వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న సమయంలో ఈ లావాదేవీ జరిగింది.
కీసర చెరువు వద్ద కారులో ఐదు లక్షల రూపాయల నగదును లంచంగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి అక్కడి నుంచి పరుగులు పెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్రమత్తమైన అధికారులు వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన తరుణంలో సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఇద్దరూ ఏసీబీ అధికారులకు అధికారులకు దొరకకుండా కెమికల్ టెస్టులు చేయించుకోకుండా నానా హంగామా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇద్దరు పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధ్యతాయుతమైన పోలీసు శాఖలో పనిచేస్తూ ఇలా ఇష్టానుసారంగా డిమాండ్ చేసి అవినీతికి పాల్పడిన ఈ ఘటనతో స్థానిక పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.