ప్రభుత్వ భూమి వినియోగంపై వివాదం
పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ భూమిలోనే నిర్మించాలి: గ్రామస్తులు
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్ ప్రతినిధి: బొంరాస్‌పేట్‌లో గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి స్థలం ఎంపిక, ప్రభుత్వ–వ్యక్తిగత భూముల హద్దులు, భూ రికార్డులపై వివాదం నెలకొంది. గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు భూమిని పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాంతంలో పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని వారు కోరుతున్నారు.
భూ రికార్డుల్లో విస్తీర్ణం, ఖాతా నంబర్లకు సంబంధించిన సమస్యలపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వ, వ్యక్తిగత భూముల హద్దులపై సమగ్ర సర్వే నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, భూ వివాదం నేపథ్యంలో ఉప్పరి జగదీశ్వరి అనే మహిళ భయాందోళనకు గురై కిందపడటంతో గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను తొలుత కొడంగల్‌లోని ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
సర్పంచ్ వివరణ: ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఎలాంటి కక్ష, పక్షపాతం లేదా లాభాపేక్ష లేదని సర్పంచ్ పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులు లేదా కోర్టు నుంచి లిఖితపూర్వక ఆదేశాలు అందజేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భూ రికార్డులు, సర్వే హద్దులు, పంచాయతీ కార్యాలయం, PHC స్థలాలకు సంబంధించిన వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు.