రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ పోటాపోటీ ధర్నాలు
రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు
-కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ పోటాపోటీ ధర్నాలు
-స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్..
-మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలంటూ బీఆర్‌ఎస్
-మధ్యలో పాలిటెక్నిక్ విద్యార్థుల మెరుపు ధర్నా.. -పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఉద్రిక్తత
పటాన్‌చెరు,….పటాన్‌చెరు అంబేద్కర్ సర్కిల్ మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్‌ఎస్ నాయకులు పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించగా.. ఇదే సమయంలో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మెరుపు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల నినాదాలతో కొద్దిసేపు అంబేద్కర్ సర్కిల్ పరిసరాలు హోరెత్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
కేసీఆర్ దళిత ద్రోహి: కాంగ్రెస్
అసెంబ్లీలో స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. గాంధీ పార్క్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ దళితులను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలి: బీఆర్‌ఎస్
మరోవైపు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.
విద్యార్థుల ధర్నాతో మరింత ఉద్రిక్తత
ఇదే సమయంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకుని మెరుపు ధర్నా చేపట్టారు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆందోళనలతో ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల నినాదాలతో పాటు విద్యార్థుల ఆందోళనతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా.. విరమించకపోవడంతో పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి సమస్యపై సర్దిచెప్పారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించడంతో పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. పోలీసులు సమన్వయంతో వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితి అదుపులోకి వచ్చింది.