మధుయాష్కిని కలిసిన ఏఐపీసీ తెలంగాణ ప్రతినిధులు ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై చర్చ
తెలంగాణ బ్యూరో ప్రతినిధి
: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్‌ను ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు శనివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో ఏఐపీసీని మరింత బలోపేతం చేయడం, వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, మేధావులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌ను ఏఐపీసీ వేదికపైకి తీసుకువచ్చి, వారి సూచనలు, ఆలోచనలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని మధుయాష్కి గౌడ్ సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకుని విభజన రాజకీయాలకు పాల్పడుతోందని పేర్కొంటూ, వాటిని ఎదుర్కొనేందుకు మేధావులు, వృత్తి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సమైక్యతను కాపాడే దిశగా ఏఐపీసీ చురుకైన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఇటిక్యాల పురుషోత్తం, ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జి. ఆదిత్య రెడ్డి, ప్రతినిధులు డాక్టర్ సౌజన్య, క్వీన్ విక్టోరియా, ధనలక్ష్మి, నితిజ్ఞ, సుబ్బారావు, శశాంక్, భరత్ రెడ్డి, సంతోష్, అధిత తదితరులు పాల్గొన్నారు.