ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ మండపాలను సందర్శించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో వినాయక ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, విద్యుత్ భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ ఖైరతాబాద్ బడా గణేష్ మండపాన్ని సీఎండీ సందర్శించి విద్యుత్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశమై విద్యుత్ సరఫరా, బ్యాకప్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానం తదితర అంశాలపై చర్చించిన అనంతరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో సమావేశమైన సీఎండీ, మండప పరిసరాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు), ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలు, అత్యవసర బ్యాకప్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వినాయక ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జన ఊరేగింపుల వరకు విద్యుత్ వ్యవస్థలను 24 గంటల పాటు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు.
ఖైరతాబాద్ మండపం వద్ద విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భారీగా తరలివచ్చే భక్తుల దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండప పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, కనెక్షన్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
అనంతరం సీఎండీ బాలాపూర్ గణేష్ మండపాన్ని సందర్శించి అక్కడి విద్యుత్ ఏర్పాట్లను పరిశీలించారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీ కల్లెం నిరంజన్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులతో సమావేశమై ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సరఫరాకు సంబంధించిన అవసరాలు, స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాలకు అవసరమైన ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు, అత్యవసర సిబ్బంది నియామకం, 1912 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ వంటి చర్యలు చేపట్టామని సీఎండీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉత్సవాలు ప్రశాంతంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగేలా టీజీఎస్పీడీసీఎల్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ డైరెక్టర్ డా. ఎన్. నరసింహులు, సీఈ కరుణాకర్ బాబు, సీఈ గోపయ్య, డీఈ సైఫాబాద్ శ్రీ గోపి, డీఈ గోపాలకృష్ణ, ఏఈ లక్ష్మయ్య, సివిడి హరి సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, టీజీఎస్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.